భారత్ 443/1 ముంబాయి : శ్రీలంకతో ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి మూడో టెస్ట్ రెండు రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కోల్పోయి 443 పరుగులు చేసింది. భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 284 పరుగులతోను, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ 62 పరుగులతోనూ క్రీజ్ వద్ద ఉన్నారు.
అంతకు ముందు గురువారం ఉదయం 393 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ కు గౌతం గంభీర్ దూరంగా ఉండడంతో మురళీ విజయ్ ను టీమిండియా కెప్టెన్ ధోనీ సెహ్వాగ్ కు తోడుగా ఓపెనింగ్ కు పంపించాడు. ఒక పక్కన సెహ్వాగ్, మరో పక్కన మురళీ విజయ్ శ్రీలంక బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. ఆట 39.1వ ఓవర్ వద్ద మురళీ విజయ్ తన వ్యక్తిగత స్కోర్ 87 పరుగుల వద్ద రంగణ హెరాత్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యుగా వెనుదిరిగాడు. వీరూ - విజయ్ 221 పరుగుల పార్ట్నర్ షిప్ సాధించారు.
విజయ్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ కు రాహుల్ ద్రావిడ్ తోడుగా మైదానంలో అడుగుపెట్టాడు. వీరిద్దరూ కూడా శ్రీలంక జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించారు. టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వీరూ - ద్రావిడ్ ల భాగస్వామ్యం కూడా 222 పరుగుల (సెహ్వాగ్ 165, ద్రావిడ్ 62) వద్ద ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ వ్యక్తిగత స్కోర్ లో 7 సిక్సర్లు, 40 బౌండరీలుండగా, ద్రావిడ్ స్కోర్ లో ఐదు బౌండరీలున్నాయి.
News Posted: 3 December, 2009
|