ధోనీ సెంచరీ- భారత్ రికార్డ్ ముంబాయి : భారత క్రికెట్ జట్టు శుక్రవారం ఓ అపూర్వ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకుంది. ముంబాయిలోని బ్రౌర్న్ స్టేడియం ఈ కొత్త రికార్డుకు వేదిక అయింది. శ్రీలంకతో జరుగుతున్న చివరి, మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 726 పరుగులకు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక పరుగుల రికార్డు. గతంలో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుపై ఏడు వికెట్ల నష్టానికి భారత్ 705 పరుగులు చేసి డిక్లేర్ చేసిన రికార్డును ఈ సరికొత్త రికార్డు తుడిచిపెట్టేసింది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెంచరీ చేసిన వెంటనే తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. రంగణ హెరాత్ వేసిన బంతిని సిక్సర్ కొట్టడం ద్వారా ధోని తన టెస్ట్ కెరీర్ లో 3వ సెంచరీని పూర్తిచేశాడు. కాగా, సొంతగడ్డపై భారత్ చేసిన అత్యధిక పరుగుల స్కోర్ (726) ఇదే. భారత్ 333 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది.
అంతకు ముందు భారత్ ఒక వికెట్ నష్టానికి 443 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో శుక్రవారం ఉదయం బరిలో దిగింది. భారత డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ రికార్డుకు కేవలం 7 పరుగుల దూరంలో మిస్సయ్యాడు. 254 బంతులు ఎదుర్కొన్న వీరూ 7 సిక్సర్లు, 40 బౌండరీల సాయంతో 293 పరుగులు చేశాడు. ఆట 82.2వ ఓవర్ లో ముత్తయ్య మురళీధరన్ కు వీరూ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. భారత టాప్ ఆర్డర్ లో ఒక్క యువరాజ్ సింగ్ (23) మినహా మిగిలిన అందరూ అద్భుతంగా రాణించారు.
శ్రీలంక బౌలింగ్ లో ముత్తయ్య మురళీధరన్ మరోసారి తన శక్తియుక్తులను ప్రదర్శించాడు. కీలకమైన వీరూ, లక్ష్మణ్ వికెట్లతో పాటు భజ్జీ, జహీర్ వికెట్లను కూడా మురళీధరన్ తీసుకున్నాడు. రంగణ హెరాత్ కూడా ముత్తయ్య మురళీధరన్ కు తోడుగా నిలిచి మూడు వికెట్లు పడగొట్టాడు. చణక వెలెగెదర, నువన్ కులశేఖర చెరో వికెట్ తీసుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : మురళీ విజయ్ 87, వీరేంద్ర సెహ్వాగ్ 293, రాహుల్ ద్రావిడ్ 74, సచిన్ టెండుల్కర్ 53, వివిఎస్ లక్ష్మణ్ 62, యువరాజ్ సింగ్ 23, మహేంద్ర సింగ్ ధోనీ 100 నాటౌట్, హర్భజన్ సింగ్ 1, జహీర్ ఖాన్ 7, ఎస్. శ్రీశాంత్ 8, ప్రజ్ఞాన్ ఓజా 5 నాటౌట్. ఎక్స్ ట్రాలతో కలిపి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 726 పరుగులు.
ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తరంగ పరణవితన్, తిలకరత్నో దిల్షాలన్ లతో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
News Posted: 4 December, 2009
|