యువీకి సచిన్ వార్నింగ్! న్యూఢిల్లీ : సచిన్ రమేష్ టెండూల్కర్ కు కోపం వచ్చింది. తనను 'తాతయ్య' అంటూ ఆటపట్టించిన యువరాజ్ సింగ్ కు హెచ్చరిక జారీ చేసాడు. నన్ను 'తాతయ్య' అంటే నీకున్న ముద్దుపేర్లన్నీ బయటపెట్టి పరువు తీస్తానని సచిన్ సీరియస్ గానే యువరాజ్ ను బెదిరించాడు. 36యేళ్ళ యువకుడైన సచిన్ భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు అత్యంత సీనియర్ సభ్యుడు. ఇటీవల క్రికెట్ లో 20 వసంతాలను పూర్తి చేసుకున్న సచిన్ తమందరికీ 'తాత'ని, అందుకే అతనిని తాతయ్యా అంటూ ముద్దుగా పిలుచుకుంటామని యువరాజ్ సింగ్ టివీకెమెరాల ముందు సరదాగా చెప్పాడు.
ఈ తాతయ్య తతంగంపై సచిన్ ప్రశ్నించినప్పుడు 'నేను యువరాజ్ సింగ్ కు హెచ్చరిక చేసాను. నన్ను తాతయ్య అని పిలిచే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమన్నాను. ఎందుకంటే కెమెరాల ముందు అతనిని ముద్దుగా పిలిచేందుకు నా దగ్గర చాలా పేర్లు ఉన్నాయ'ని టెండూల్కర్ వెల్లడించాడు. ఇప్పుడు ఆ పేర్లను టీవీ కెమెరాల ముందు బయటపెట్టనని, యువరాజ్ కు మరో అవకాశం ఇవ్వదల్చుకున్నానని టెండూల్కర్ చెప్పాడు.
News Posted: 5 December, 2009
|