ఓటమి అంచున శ్రీలంక ముంబాయి : భారత్ తో ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న చివరి, మూడో మ్యాచ్ లో శ్రీలంక ఓటమి దిశగా సాగుతోంది. కెప్టెన్ సంగక్కర ఒకే ఒక్కడు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని వికెట్లను అంటిపెట్టుకొని పోరాటం చేస్తున్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అయినప్పటికీ భారత్ కంటే 59 పరుగులు వెనుకబడి ఉంది. లంక కెప్టెన్ కుమార సంగక్కర 258 పరుగులు ఎదుర్కొని ఒక సిక్సర్, 19 బౌండరీల సాయంతో 133 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. నువన్ కులశేఖర 45 బంతులు ఆడి రెండు బౌండరీలతో 9 పరుగులు చేసి నాటౌట్ గా కొనసాగుతున్నాడు.
టెస్ట్ మూడో రోజు శుక్రవారం సాయంత్రం మూడు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో 726 పరుగుల తొలి ఇన్నింగ్స్ ను భారత్ డిక్లేర్ చేసింది. తరంగ పరణవితన్ 8, తిలకరత్నె దిల్షాన్ 3 పరుగులు కలిపి శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించింది. ఆట 8.5వ ఓవర్ వద్ద ఓపెనింగ్ బ్యాట్స్ మన్ తిలకరత్నె (16 పరుగుల) వికెట్ ను హర్భజన్ సింగ్ ఎల్ బిడబ్ల్యుగా అవుట్ చేశాడు. దిల్షాన్ స్థానంలో క్రీజ్ వద్దకు వచ్చిన కెప్టెన్ సంగక్కర వికెట్ల వద్ద పాతుకుపోయాడు. ఆట 45.3వ ఓవర్ వద్ద మరో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ పరణవితన్ (54)ను కూడా శ్రీశాంత్ ఎల్ బిడబ్ల్యు చేసాడు. పరణవితన్ అవుటైన అనంతరం రెండో ఎండ్ లో బ్యాటింగ్ కు దిగుతున్న తన జట్టు బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరూ పెవిలియన్ కు చేరిపోతున్నా చలించకుండా వీరోచితంగా టీమిండియాతో పోరాటం చేస్తున్నాడు. టూ డౌన్ లో బరిలోకి వచ్చిన మహేల జయవర్దనె 12 పరుగులకు, థిలన్ సమరవీర పరుగులేవీ చేయకుండా, ఏంజెలో మాథ్యూస్ 5, పి.జయవర్దనె 32 పరుగులకు తమ తమ వికెట్లను అప్పగించి వెనక్కితిరిగి వచ్చేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సంగక్కర, నువన్ కులశేఖర 9 పరుగులతో నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు.
భారత బౌలింగ్ లో ప్రజ్ఞాన్ ఓజా, జహీర్ ఖాన్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ తో సమానం కావాలంటే శ్రీలంక ఇంకా 59 పరుగులు చేయాల్సి ఉంది. ఆపైన లీడ్ సాధించాలి. ఈ లోగా లంకను ఆలౌట్ చేసి భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను, సీరీస్ ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రేపు సాయంత్రం వరకూ వికెట్లను కాపాడుకుంటూ భారత్ కు రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఇవ్వకపోతే ఫలితం ఎటూ తేలకుండా డ్రా అవుతుంది.
News Posted: 5 December, 2009
|