టీమిండియా నెం.1 ముంబయి : టెస్ట్ క్రికెట్ ప్రపంచ శిఖరాగ్రాన భారత్ జట్టు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ఇక్కడ బ్రేబోర్న్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న సీరిస్ ఆఖరి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్, 24 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల ఈ సీరీస్ ను 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. ఇంతకాలం దక్షిణాఫ్రికాతో పంచుకున్న ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్ మొదటి స్థానాన్ని స్వంతంగా దక్కించుకుంది. దక్షిణాఫ్రికాను రెండోస్థానంలోకి నెట్టేసింది. భారత్ ఈ చరిత్రాత్మక స్థానాన్ని చేరుకోడానికి 77 యేళ్ళ సుదీర్ఘకాలం నిరీక్షించవలసి వచ్చింది. ఇండియా లార్డ్స్ గా కీర్తించే బ్రేబోర్న స్టేడియంలో 36 సంవత్సరాల తరువాత జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ విజయం భారత క్రికెట్ చరిత్రలో మైలురాయిగా మిగలనుంది. ప్రపంచ క్రికెట్ ప్రేమికులు కలకాలం గుర్తుంచుకునే అద్భుతమైన మ్యాచ్ గా ఇది సాగింది. తన సూపర్ ఇన్నింగ్స్ తో 293 పరుగులు చేసిన సెహ్వాగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అలానే మ్యాన్ ఆఫ్ ద సీరీస్ అవార్డు కూడా నజాఫ్ ఘడ్ నవాబ్ నే వరించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 393 పరుగులు చేసింది. దానికి సమాధానంగా భారత్ 726 పరుగులు చేసి ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా డిక్లేర్ చేసింది. 333 పరుగుల లోటుతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక నాలుగో రోజు సంగక్కర సహాయంతో పోరాటం చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఆలస్యం చేసింది. ఐదో రోజు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 59 పరుగులు చేయాల్సిన శ్రీలంక కేవలం 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పరాజయాన్ని అంగీకరించింది. మొదటి ఓవర్ లోనే సంగక్కర అవుట్ కావడంతో శ్రీలంక అపజయం ఖాయమైపోయింది. ఆదివారం ఉదయం భారత్ తీసిన నాలుగు వికెట్లలో మూడు వికెట్లు జహీర్ ఖాన్ కే లభించాయి. దాంతో ఇన్నింగ్స్ లో జహీర్ కు మొత్తం ఐదు వికెట్లు లభించాయి.
News Posted: 5 December, 2009
|