తొలి ట్వంటీ లంకదే నాగపూర్ : రాయల్ స్టాగ్ కప్ తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. కేవలం 37 బంతుల్లో రెండు సిక్సర్లు, 11 బౌండరీల సాయంతో 78 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించిన శ్రీలంక కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ కుమార సంగక్కర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. భారత జట్టు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ రాణించినప్పటికీ మిగిలిన బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా శ్రీలంక 1-0 ఆధిక్యం సాధించింది.
ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీనితో మైదానంలోకి వచ్చిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేశారు. సమాధానంగా 216 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ధోనీ సేన 9 వికెట్లు జారవిడుచుకొని 186 పరుగుల వద్దే చేతులెత్తేసింది. దీనితో లంక 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ ను కోల్పోయిన లంకేయులు ఈ విజయంతో కాస్త ఊరట పొందారు.
జట్ల స్కోర్ల వివరాలు :
శ్రీలంక : తిలకరత్నె దిల్షాన్ - 34, సనత్ జయసూర్య - 26, కె. సంగక్కర - 78, మహేల జయవర్దనె - 9, చమర కపుగెదెర - 47, ఏంజెలో మాథ్యూస్ - 15 నాటౌట్. ఎక్స్ ట్రాలు 6. మొత్తం 215 పరుగులు.
భారత్ : గౌతం గంభీర్ - 55, వీరేంద్ర సెహ్వాగ్ - 26, ధోనీ - 9, యువరాజ్ సింగ్ - 6, రోహిత్ శర్మ - 21, యూసఫ్ పఠాన్ - 0, అశోక్ దిండా - 19, ఆశిష్ నెహ్రా - 22, ప్రజ్ఞాన్ ఓజా - 10 నాటౌట్, ఇశాంత్ శర్మ - 5 నాటౌట్. ఎక్స్ ట్రాలు 10. మొత్తం 186 పరుగులు.
బౌలింగ్ :
భారత్ : ఆశిష్ నెహ్రా, అశోక్ దిండా, యూసఫ్ పఠాన్, రోహిత్ శర్మ తలొ వికెట్ తీసుకున్నారు.
శ్రీలంక : ఏంజెలో మాథ్యూస్, సనత్ జయసూర్య రెండేసి వికెట్లు తీసుకోగా, నువన్ కులశేఖర, ఎం. పుష్పకుమార, తిలకరత్నె దిల్షాన్ తలో వికెట్ పడగొట్టారు.
News Posted: 9 December, 2009
|