శ్రీశాంత్ కు స్వైన్ ఫ్లూ

మొహాలీ : భారత క్రికెట్ జట్టు పేసర్ ఎస్. శ్రీశాంత్ కు స్వైన్ ఫ్లూ సోకింది. శుక్రవారం శ్రీశాంత్ కు నిర్వహించిన పరీక్షల్లో స్వైన్ ఫ్లూ వైరస్ హెచ్ 1 ఎన్ 1 ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం శ్రీలంక జట్టుతో ఇక్కడ జరగనున్న టి 20 మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు తెలెత్తుతున్నాయి. శ్రీశాంత్ లో స్వైన్ ఫ్లూ వైరస్ లక్షణలా కనిపించడంతో భారత టి 20 జట్టు సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.
'స్వైన్ ఫ్లూ లక్షణాలతో శ్రీశాంత్ గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఇక్కడి ఫోర్టీస్ ఆస్పత్రిలో చేరాడు. వైద్య నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో హెచ్ 1 ఎన్ 1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింద'ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి.ఎస్. వాలియా శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. 'గురువారం రాత్రి 11.30 గంటలకు శ్రీశాంత్ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో శ్రీశాంత్ చేరే ముందు ఆస్పత్రి ఫిజీషియన్ డాక్టర్ వికాస్ భుటానీ పరీక్షించారు. విపరీతమైన దగ్గు, జ్వరం, వళ్ళు నొప్పులు, గొంతునొప్పితో బాధపడుతున్నందున హెచ్ 1 ఎన్ 1 పరీక్షలకు డాక్టర్ పంపించారు. పరీక్షల్లో శ్రీశాంత్ కు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నివేదిక శుక్రవారం సాయంత్రం అందింది' అని వాలియా వివరించారు. దీనితో శ్రాశాంత్ కు తమిఫ్లూ మందులు ఇస్తున్నట్లు చెప్పారు.
శ్రీశాంత్ కు స్వైన్ ఫ్లూ సోకిందన్న వార్త టీమిండియా శిబిరాన్ని తప్పనిసరిగా ఆందోళకు గురిచేస్తుంది. ఎందుకంటే గురువారం సాయంత్రం జట్టు సభ్యులతో కలిసే శ్రీశాంత్ వచ్చాడు. జట్టు సభ్యులందరితోనూ కలిసిమెలిసి అతి సమీపంగా తిరిగాడు. దీనితో ఇతర జట్టు సభ్యులెవరికైనా స్వైన్ ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ అలాంటి లక్షణాలు ఇంతవరకూ ఎవరిలోనూ కనిపించలేదని వాలియా అన్నారు. మరి ఒకటి రెండు రోజులు శ్రీశాంత్ ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉన్న కారణంగా శనివారం జరిగే టి 20 మ్యాచ్ లో అతను పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం శ్రీశాంత్ వేగంగా కోలుకుంటున్నాడని చెప్పారు.
అంతకు ముందు శుక్రవారం ఉదయం ఫోర్టీస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎఆర్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, దగ్గు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతూ శ్రీశాంత్ గురువారం రాత్రి తమ ఆస్పత్రిలో చేరాడని చెప్పారు. శ్రీశాంత్ లో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలకు పంపించామన్నారు. ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయిన నేపథ్యంలో చండీగఢ్ లో గత పది రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగాయన్నారు. ఇప్పటికే స్వైన్ ఫ్లూతో పది మంది మరణించారని ఆయన తెలిపారు.
News Posted: 12 December, 2009
|