విశాఖ వన్డే డౌటే! న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమం కారణంగా భారత, శ్రీలకం క్రికెట్ జట్ల మధ్య విశాఖపట్నంలో జరగవలసిన రెండవ వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) పోటీపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. విశాఖపట్నంలో రాజకీయ అలజడి కారణంగా డిసెంబర్ 18న జరగవలసిన ఈ మ్యాచ్ ను మరేదైనా వేదికకు మార్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
డిసెంబర్ 18 నాటి మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు బిసిసిఐ వర్గాలు తెలియజేశాయి. అయితే, రెండవ ఒడిఐ గురించి అనుమానాలు ఉన్నాయనడాన్ని విశాఖపట్నం క్రికెట్ సంఘం (విసిఎ) ఖండించింది. 'డిసెంబర్ 18 ఒడిఐని రద్దు చేసినట్లు గాని, వేదికను మార్చినట్లు గాని మాకు ఎటువంటి సమాచారమూ లేదు. అందువల్ల ముందు నిర్ణయించిన ప్రకారమే మేము సన్నాహాలు చేస్తున్నాం' అని విసిఎ అధికారి ఒకరు చెప్పారు. ఆంధ్రా క్రికెట్ సంఘం (ఎసిఎ) బిసిసిఐకి ఎటువంటి అధికారిక వర్తమానాన్నీ పంపలేదు. కాని అండర్ 16, అండర్ 19 పోటీలు కొన్నిటిని మాత్రం రద్దు చేశారు.
కాగా, ఈ పోటీని మరేదైనా వేదికకు మార్చవలసి వస్తే బిసిసిఐ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇంత స్వల్ప వ్యవధిలో మ్యాచ్ కు మరొక వేదికను సిద్ధం చేయడం అత్యంత కష్టం కాగలదు.
News Posted: 12 December, 2009
|