భారత్ 6 వికెట్ల విజయం మొహాలీ : శ్రీలంకతో ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో టి 20 మ్యాచ్ ను భారత్ 6 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మాతృ మైదానంలో ఆడిన పంజాబ్ పుత్తర్ యువరాజ్ సింగ్ కేవలం 25 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతే కాకుండా మూడే ఓవర్లు బౌల్ చేసి మూడు శ్రీలంక వికెట్లను పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీనితో శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా ఆడిన రెండు టి 20 మ్యాచ్ లలో చెరొకటి నెగ్గడం ద్వారా 1-1 సమ ఉజ్జీలుగా నిలిచాయి.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ 1, సనత్ జయసూర్య 31, కెప్టెన్ కమ్ కీపర్ కుమార సంగక్కర 59, చింతక జయసింఘె 38, మహేల జయవర్దనె 12, చమర కపుగదెర 2, కౌసల్య వీరరత్నె 3 పరుగులు చేశారు. ఏంజెలో మాథ్యూస్ 26, నువన్ కులశేఖర 10 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు.
భారత బౌలింగ్ లో యువరాజ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ 2, యూసఫ్ పఠాన్ ఒక్క వికెట్ తీసుకున్నారు. కౌసల్య వీరరత్నెను సెహ్వాగ్, ధోనీ రన్నౌట్ చేశారు.
సమాధానంగా 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లకే విజయాన్ని సాధించింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 211 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతం గంభీర్ 21, వీరేంద్ర సెహ్వాగ్ 64, ధోనీ 46, యువరాజ్ సింగ్ 60 నాటౌట్, సురేష్ రైనా 9, దినేష్ కార్తీక్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.
శ్రీలంక బౌలింగ్ లో లసిత్ మలింగ, దిల్హారా ఫెర్నాండో చెరో వికెట్ తీసుకోగా, గౌతం గంభీర్, సురేష్ రైనా వికెట్లు రన్నౌట్ గా దొరికాయి.
News Posted: 12 December, 2009
|