నాగపూర్ లో విశాఖ వన్డే న్యూఢిల్లీ : భారత, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య విశాఖపట్నంలో ఈ నెల 18 జరగవలసిన రెండవ వన్ డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) వేదిక నాగపూర్ కు మారింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ పోటీకి భద్రతా ఏర్పాట్లు చేయడం తమ వల్ల కాదని విశాఖపట్నం పోలీసులు స్పష్టం చేసిన తరువాత బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన దరిమిలా ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సంగతి విదితమే. 'భారత, శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సీరీస్ లో రెండవ వన్డేని నాగపూర్ కు మార్చడమైనది. ఇది ఇక డేనైట్ పోటీ అవుతుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే డిసెంబర్ 18న జరుగుతుంది' అని బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మ్యాచ్ నిర్వహణ కోసం తగినంత మంది భద్రతా సిబ్బందిని సమకూర్చడం తమకు కష్టం కాగలదని సోమవారం ఉదయం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సాంబశివరావు ప్రకటించారు. 'నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఎలా ఉందంటే నగర పోలీస్ సిబ్బంది అందరినీ మామూలు శాంతి భద్రతల పరిరక్షణకే నియోగించవలసి వస్తున్నది. ఇక మామూలు పరిస్థితులలో మ్యాచ్ నిర్వహణకు నగర పోలీస్ బలగంలో 80 శాతాన్ని మేము నియోగించవలసి ఉంటుంది. ఈ దశలో మ్యాచ్ నిర్వహణకు ఏ స్థాయిలోనూ సిబ్బందిని సమకూర్చడం మాకు సాధ్యం కాదని స్థానిక పోటీ నిర్వాహకులకు మేము తెలియజేశాం' అని సాంబశివరావు విశాఖపట్నంలో విలేఖరులతో చెప్పారు.
కాగా, ఈ సీరీస్ లో తొలి మ్యాచ్ ను మంగళవారం రాజ్ కోటలో నిర్వహిస్తున్న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ పోటీకి కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
News Posted: 14 December, 2009
|