భారత్ 414/7 రాజ్ కోట్ : శ్రీలంకతో ఇక్కడి మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక జట్టుకు 415 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా ఆడనున్న ఐదు వన్డేల సీరీస్ లో భాగంగా తొలి వన్డే మంగళవారం రాజ్ కోట్ లో జరుగుతున్నది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది.
భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ నిజంగానే టాప్ లేపింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి రెచ్చిపోయి తన వీర ప్రతాపాన్ని క్రికెట్ అభిమానులుకు ప్రదర్శించాడు. కేవలం 102 బంతులు ఎదుర్కొన్న వీరూ ఆరు సిక్సర్లు, 17 బౌండరీల సాయంతో 146 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సచిన్ టెండుల్కర్ కూడా దూకుడుగా ఆడి 63 బంతుల్లో 69 పరుగులు చేశాడు. సచిన్ స్కోర్ లో ఒక సిక్సర్, 10 బౌండరీలున్నాయి. వన్ డౌన్ లో బరిలోకి దిగిన కెప్టెన్ ధోనీ కూడా శ్రీలంక బంతులను మైదానం నలుదిక్కులకూ పరుగులెత్తించి లంకేయులను చెమటలు కక్కించాడు. 53 బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సర్సు, 7 బౌండరీలతో 72 పరుగులు చేశాడు. అయితే, టాప్ ఆర్డర్ చక్కగా రాణించినప్పటికీ మిడిలార్డర్ మాత్రం తత్తరపాటు పడింది. తక్కువ స్కోర్లకే మిడిలార్డర్ పెవిలియన్ కు చేరుకుంది. సురేష్ రైనా 16, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్ చెరో 11 పరుగులు చేశారు. విరాట్ కొహ్లి 27 పరుగులకు ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 30 పరుగులతోను ప్రవీణ్ కుమార్ 5 పగులతోనూ నాటౌట్ నిలిచారు. శ్రీలంక బౌలర్లు ఇచ్చిన 27 ఎక్ స్ట్రా పరుగులతో కలిపి భారత్ మొత్తం 414 పరుగులు చేసింది.
శ్రీలంక బౌలింగ్ లో నువన్ కులశేఖర, చణక వెలెగెదర, దిల్హారా ఫెర్నాండో తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. ఏంజెలో మాథ్యూస్ ఒక వికెట్ తీసుకున్నాడు.
News Posted: 15 December, 2009
|