లంక ఓడింది రాజ్ కోట్ : హోరాహోరీగా జరిగిన తొలి వన్డే సమరంలో శ్రీలంక పోరాడి ఓడింది. మెరిసే తారలు తమ జట్టులోనూ ఉన్నారని నిరూపిస్తూ రికార్డు పరుగుల లక్ష్యాన్ని లెక్కచేయకుండా శ్రీలంక మొదటి బంతి నుంచీ చివరి వరకూ పోరాటాన్నే సాగించింది. అయితే, శ్రీలంక టైలెండర్ల అనుభవ రాహిత్యం భారతను గెలిపించింది. మూడు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగలిగింది. వీరేంద్ర సెహ్వాగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నిర్వాహకులు అందజేశారు. ఈ విజయంతో భారత్ శ్రీలంకతో జరిగే ఐదు వన్డేల సీరీస్ లో 1 - 0 ఆధిక్యంలో ఉంది.
టాస్ గెలిచిన శ్రీలంక భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్లు మొదటి నుంచీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. సెహ్వాగ్ అయితే, తన ముందుకు వచ్చిన ప్రతి బంతికీ చుక్కలు చూపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 102 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 16 బౌండరీలతో 146 పరుగులు చేశాడు. భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 414 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది.
సమాధానంగా 415 పరుగుల విజయలక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగింది. శ్రీలంక ఓపెనర్లు డబ్ల్యుయు తరంగ 60 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేయగా తిలకరత్నె దిల్షాన్ 124 బంతుల్లో 160 పరుగులు చేశాడు. దిల్షాన్ స్కోర్ లో మూడు సిక్సర్లు, 20 బౌండరీలు ఉండగా, తరంగ 4 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. లంక కెప్టెన్ కుమార సంగక్కర కేవలం 43 బంతులు ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. సంగక్కర ఐదు సిక్సర్లు, 10 బౌండరీలతో ఈ స్కోర్ చేశాడు. మిగిలిన లంక బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్య 5, మహేల జయవర్దనె 3, థిలిన కాందంబె 24, ఏంజెలో మాథ్యూస్ 38 పరుగు చేశారు. థిలన్ సమరవీర పరుగులేవీ చేయకుండానే సురేష్ రైనా రన్నౌట్ చేయడంతో పెవిలియన్ చేరుకున్నాడు. నువన్ కులశేఖర 2, చణక వెలెగెదర 1 పరుగుతో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నారు. మొత్తం 21 ఎక్ స్ట్రా పరుగులతో కలిసి శ్రీలంక 411 పరుగులు చేయగలిగింది.
భారత బౌలింగ్ లో హర్భజన్ సింగ్ రెండు అతి కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్ కుమార్, ఆశిష్ నెహ్రా, సురేష్ రైనా తలో వికెట్ పడగొట్టారు. మహేల జయవర్దనె, థిలిన కాందంబె రన్నౌట్ అయ్యారు.
News Posted: 15 December, 2009
|