నాగ్ పూర్ వన్డే నేడు నాగ్ పూర్ : శ్రీలంక జట్టు భారత క్రికెట్ జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం నాగ్ పూర్ లో జరగనున్నది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. శ్రీలకం జట్టు భారత పర్యటనలో భాగంగా జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ రెండో వన్డే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నంలో జరగాల్సి ఉంది. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతుండడం, వన్డే మ్యాచ్ ను అడ్డుకుంటామని ఆందోళనకా నాయకత్వం వహిస్తున్న కొన్ని సంఘాలు హెచ్చరించడం, అలజడిగా ఉన్న విశాఖపట్నంలో అదనపు భద్రత కల్పించలేమని పోలీసు కమిషనర్ చేతులెత్తేయడంతో ఈ వన్డేను బిసిసిఐ నాగ్ పూర్ కు మార్చింది.
క్రికెట్ అభిమానులకు పరుగుల పండుగ చేసే నాగ్ పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ (విసిఎ) స్టేడియంలో కూడా రాజ్ కోట్ వన్డే మాదిరిగా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మైదానంలో బౌలర్లకు, ఫీల్డర్లకు కూడా మరోసారి అగ్ని పరీక్షగా కానున్నది. బ్యాట్స్ మెన్ ను పరుగులు చేయకుండా కట్టడిచేయడం ఈ స్టేడియంలో ఏమంత సులువైన పని కాదు. అందుకే ఇరు జట్లూ క్యాచ్ లపైనే దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా క్యాచ్ లు పట్టడంలోనే ఎక్కువగా మనసు కేంద్రీకరించాయి.
అయితే, పిచ్ చీఫ్ క్యురేటర్ ప్రవీణ్ హింగ్నెకర్ మాత్రం రాజ్ కోట్ పరిస్థితి పునరావృతం కాదని చెబుతున్నారు. ఈ పిచ్ పై ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు 300 గాని అంతకు కొద్దిగా ఎక్కువ గాని పరుగులు చేసే వీలుందన్నారు. రన్ ఫ్రెండ్లీ స్టేడియంగా ఉన్నప్పటికీ బౌలర్లు ఎలాంటి వత్తిడినీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ డే నైట్ మ్యాచ్ లో టాస్ గెలవడమే కీలకంగా మారనున్నదని చెప్పాడు. కొత్త బంతితో ముందుగా బౌలింగ్ చేసే జట్టుకు ఫాస్ట్ బౌలర్ల నుంచి తప్పకుండా మంచి సహాయం అందుతుందని ప్రవీణ్ హింగ్నెకర్ అన్నాడు. టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటే ఆ నిర్ణయంలో ఎలాంటి తప్పు ఉండబోదన్నాడు.
ఐదు వన్డేల సీరీస్ లో తొలి వన్డేలో నెగ్గిన ధోనీ సేన నాగ్ పూర్ లో కూడా నెగ్గి సీరీస్ లో భారత్ ను 2-0 ఆధిక్యంలో ఉంచాలని ఉవ్విళ్ళూరుతున్నారు. పోరాట పటిమకు పెట్టింది పేరైన శ్రీలంక ఈ వన్డే ఎలాగైనా నెగ్గి సీరీస్ లో సమంగా ఉండాలన్న వ్యూహంతో బరిలోకి దిగుతోంది.
తొలి వన్డే ఫీల్డింగ్ సమయంలో మోకాలి గాయానికి తగిలినా వీరేంద్ర సెహ్వాగ్ నాగ్ పూర్ వన్డేలో ఆడేందుకు ఫిట్ గా ఉన్నాడు. అయితే, యువరాజ్ సింగ్ గాయంతో ఈ రోజు కూడా మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అలాగే శ్రీలంక జట్టులో కూడా అనుభవజ్ఞులైన బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, దిల్హారా ఫెర్నాండో గాయాల కారణంగా ఈ రోజు పోటీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి.
News Posted: 18 December, 2009
|