లంక లక్ష్యం 302 నాగ్ పూర్ : ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే (డే/నైట్)లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. శ్రీలంక జట్టుకు 302 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రీలంకను ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదటి ఓవర్ నాలుగో బంతికే వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ కోల్పోయింది. లంక బౌలర్ వెలెగెదర వేసిన బంతిని వీరూ ఆడి సంగక్కర చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరు స్థానంలో క్రీజ్ వద్దకు వచ్చిన గౌతం గంభీర్ కూడా కేవలం 6 బంతులే ఎదుర్కొని 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రన్నౌట్ గా మైదానం నుంచి బయటికి వచ్చేశాడు.
ఆట 16.5వ ఓవర్ వద్ద ఓపెనింగ్ బ్యాట్స్ మన్ సచిన్ టెండుల్కర్ మెండిస్ బంతికి సంగక్కర చేతిలో స్టంప్ ఔట్ అయ్యాడు. సచిన్ 52 బంతులు ఎదుర్కొని తన వ్యక్తిగత స్కోర్ 43 వద్ద ఔటై పెవిలియన్ కు చేరాడు. అప్పటికి భారత్ స్కోర్ 81 పరుగులు. టాప్ ఆర్డర్ లోని రెండు బలీయమైన వికెట్లు అతి తక్కువ స్కోర్లకే పోగొట్టుకున్న భారత్ కష్టాల్లో పడినట్లే కనిపించింది. అయితే, అప్పటి నుంచి విరాట్ కొహ్లి, కెప్టెన్ ధోనీ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కొహ్లీ 65 బంతులు ఎదుర్కొని 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించి, సూరజ్ రణ్ దివ్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు అయ్యాడు. అప్పటికి భారత్ 132 పరుగుల స్కోర్ చేసింది. కొహ్లి స్థానంలో క్రీజ్ వద్దకు వచ్చిన సురేష్ రైనా కూడా ధోనీతో కలిసి చక్కని అవగాహనతో ఆడాడు. 55 బంతులు ఎదుర్కొన్న రైనా 3 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 68 పరుగులు చేశాడు. ఆట 46.2వ ఓవర్ వద్ద ఉండగా ఏంజెలో మాథ్యూస్ వేసిన బంతిని ఆడి రణి దివ్ కు క్యాచ్ ఇచ్చి వికెట్ అప్పగించాడు. అనంతరం రవీంద్ర జడేజా రంగంలోకి దిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న జడేజా 12 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఆట 49.3వ ఓవర్ వద్ద ధోనీ లంక బౌలర్ రణ్ దివ్ బంతిని దిల్షాన్ చేతిలోకి కొట్టి ఔటయ్యాడు. 111 బంతులు ఎదుర్కొన్న ధోనీ 2 సిక్సర్లు, 8 బౌండరీల సాయంతో 107 పరుగులు చేశాడు.
శ్రీలంక బౌలింగ్ లో సూరజ్ రణ్ దివ్ 3 వికెట్లు పడగొట్టాడు. చణక వెలెగెదర, ఏంజెలో మాథ్యూస్, అజంతా మెండిస్ తలో వికెట్ తీసుకున్నారు. ఇక శ్రీలంక 302 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేస్తోంది.
News Posted: 18 December, 2009
|