శ్రీలంక 3 వికెట్ల విజయం నాగ్ పూర్ : టీమిండియాపై హోరాహోరీగా, తీవ్ర ఉత్కంఠగా సాగిన రెండో వన్డేను శ్రీలంక జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్ లోని ఈ డే/నైట్ మ్యాచ్ శుక్రవారం ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 301 పరుగులు చేసింది. సమాధానంగా 302 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన లంకేయులు ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయానికి అవసరమైన పరుగులు సాధించారు. 49వ ఓవర్ లో జహీర్ ఖాన్ చేసిన రెండు తప్పుల కారణంగా శ్రీలంక చివరి నిమిషం వరకూ పోరాటం చేయాల్సిన అగత్యం లేకుండా విజయం సాధించింది. బౌండరీ వైపు దూసుకుపోతున్న బంతిని పట్టుకోలేక ఒకసారి, అరటిపండులా చేతికి దొరికిన బంతిని జారవిడిచి మరోసారి జహీర్ ఖాన్ లంకేయుల లక్ష్యానికి చేయూతనిచ్చాడు. 123 పరుగులు చేసి లంక విజయానికి కారకుడైన తిలకరత్నె దిల్షాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. నాగ్ పూర్ వన్డేను శ్రీలంక కైవసం చేసుకోవడంతో సీరీస్ 1-1 గా సమం అయింది.
శ్రీలంక బ్యాట్స్ మెన్ స్కోర్ ఈ విధంగా ఉంది : ఉపుల్ తరంగ 37, తిరకరత్నె దిల్షాన్ 123, కుమార సంగక్కర 21, మహేల జయవర్దనె 39, థిలన్ కాందంబె 27, ఏంజెలో మాథ్యూస్ 37 నాటౌట్, చమర కపుగదెర 2, సూరజ్ రణ్ దివ్ 5, అజంతా మెండిస్ 2 నాటౌట్. ఎగ్ స్ట్రాలు 9. మొత్తం ఏడు వికెట్ల నష్టానికి శ్రీలంక విజయానికి అవసరమైన 302 పరుగులు చేసింది.
భారత్ బౌలింగ్ లో జహీర్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. సంగక్కర, సూరజ్ రణ్ దివ్ రన్నౌట్లయ్యారు.
News Posted: 18 December, 2009
|