తీయని తొలి గెలుపు చెన్నై : తన నూరవ టెస్ట్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్ట్ ర్యాంకింగ్ లలో అగ్ర స్థానానికి ఇండియా పురోగమనానికి నాంది పడింది 1952 ఫిబ్రవరి 10న చెన్నై చెపాక్ మైదానంలో. సి.డి. గోపీనాథ్ క్యాచ్ తో చివరి ఇంగ్లండ్ వికెట్ పతనమై ఇండియాకు ఆ విజయం సిద్ధించింది. సుమారు ఆరు దశాబ్దాల తరువాత 79 సంవత్సరాల గోపీనాథ్ ఇండియాకు తొలి టెస్ట్ విజయాన్ని సాధించిన 11 మంది క్రీడాకారులలో సజీవంగా ఉన్న ఏకైక క్రీడాకారుడు. వినూ మన్కడ్, పాలీ ఉమ్రిగర్, పంకజ్ రాయ్, గులామ్ అహ్మద్, లాలా అమరనాథ్, విజయ్ హజారె వంటి ప్రముఖ క్రీడాకారులు గతించారు.
తొలుత బ్యాట్స్ మన్ గా, ఆతరువాత సెలక్టర్ గా స్వల్ప కాలం అంతర్జాతీయ కెరీర్ సాగించిన అనంతరం గోపీనాథ్ చెన్నైలో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. శ్రీలంకను ఓడించి ఇండియా 100 టెస్ట్ విజయాలను నమోదు చేసుకున్న రోజు ఈ ఘనతలో ఆయన పాత్రపై ఎవరూ దృష్టి పెట్టలేదు. బహుశా ఆనాటి జట్టులో ఎవరైనా ఇప్పటికీ మన మధ్యే ఉన్నారేమోననే ఆలోచనే ఎవరికీ వచ్చి ఉండదు. అయితే, గోపీనాథ్ ఇందుకు చింతించడం లేదు. 'ఎవరైనా ఎందుకు నాకు ఫోన్ చేయాలి లేదా అభినందనలు తెలియజేయాలి? నేను అటువంటివి ఆశించడం లేదు. బహుశా నేను ఇంకా బతికి ఉన్నట్లు జనానికి తెలిసి ఉండదు' అని గోపీనాథ్ మందస్మిత వదనంతో అన్నారు.
News Posted: 21 December, 2009
|