శ్రీలంక 239 ఆలౌట్ కటక్ : బారాబతీ స్టేడియంలో టీమిండియాతో సోమవారం జరుగుతున్న మూడో వన్డే (డే/నైట్) మ్యాచ్ లో శ్రీలంక 239 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చక్కగా రాణించి మంచి ఆరంభాన్ని అందించిప్పటికీ మిడిలార్డర్, టెయిలెండర్లు చేతులెత్తేయడంతో 44.2 ఓవర్లకే శ్రీలంక కుప్పకూలిపోయింది. రవీంద్ర జడేజా రూపంలో లంకకు ముప్పు ముంచుకువచ్చింది. పది ఓవర్లు బౌల్ చేసిన జడేజా కేవలం 32 పరుగులిచ్చి నాలుగు లంక వికెట్లను తుత్తునియలు చేశాడు.
టాస్ గెలిచిన లంక కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకుని భారత్ ను ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. ఉపుల్ తరంగ, తిలకరత్నె దిల్షాన్ లతో పరుగుల ఖాతాను తెరిచిన శ్రీలంక 6.2వ ఓవర్ వద్ద దిల్షాన్ వికెట్ ను ఆశీష్ నెహ్రా బౌలింగ్ లో జారవిడుచుకుంది. డి. కార్తీక్ క్యాచ్ పట్టడంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద దిల్షాన్ పెవిలినయ్ చేరుకున్నాడు. దిల్షాన్ కేవలం 18 బంతులు ఎదుర్కొని 10 బౌండరీల సాయంతో అత్యంత వేగంగా ఈ స్కోర్ సాధించాడు. అయితే, 6.2వ ఓవర్ వద్దే శ్రీలంక ఓపెనర్లు 65 పరుగుల భాగస్వామ్యాన్ని తొలి వికెట్ కు అందించారు. వన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన కెప్టెన్ కుమార సంగక్కర ఉపుల్ తరంగకు తోడుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి మరోసారి స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించారు. ఆట 22.3వ ఓవర్ వద్ద మరో సారి వికెట్ కోల్పోయింది. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ వేసిన బంతిని డి.కార్తీక్ స్టంప్డ్ ఔట్ చేయడం ద్వారా సంగక్కరను మైదానం నుంచి వెనక్కి పంపించారు. అప్పటికి లంక స్కోర్ 165 కాగా, సంగక్కర వ్యక్తిగత స్కోర్ 46 పరుగులు. అనంతరం 24.4వ ఓవర్ వద్ద ఓపెనర్ ఉపుల్ తరంగను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా లంక పతనం ప్రారంభమైంది. అప్పటికి జట్టు స్కోర్ 169 పరుగులుండగా తరంగ వ్యక్తిగత స్కోర్ 73 పరుగులు ఉంది. మహేల జయవర్దనె 2, థిలిన కందంబె 22, చమర కపుగెదెర 15, నువన్ కులశేఖర 10, సూరజ్ రణ్ దివ్ 0, లసిత్ మలింగ 12, అజంతా మెండిస్ 6 పరుగులకు ఔటయ్యారు. చమర వెలెగెదెర 2 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా చెరో రెండేసి వికెట్లు తీశారు. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ చెరో వికెట్ పడగొట్టారు.
News Posted: 21 December, 2009
|