టీమిండియా విజయం కటక్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అద్భుత బ్యాటింగ్ విన్యాసం, ఎడమచేతి స్పిన్నర్ అజయ్ జడేజా బౌలింగ్ ఇంద్రజాలంతో భారత్ మూడో వన్డేలో విజయకేతనం ఎగరేసింది. ఎడు వికెట్ల తేడాతో సాధించిన ఈ గెలుపు ద్వారా ఐదు వన్డేల సీరిస్ లో టీమిండియా 2-1 విజయాలతో ముందంజలో ఉంది. మొత్తానికి ఈ సీరిస్ ను శ్రీలంక జట్టు ఉత్కంఠభరితంగా మార్చే సూచనలే కనిపిస్తున్నాయి. సోమవారం నాడిక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ గా సాగిన పోరులో భారత్ సునాయాసంగాన్నే లక్ష్యాన్ని సాధించింది. పది ఓవర్లలో కేవలం 32 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక ఆరంభంలో భారత పేస్ బౌలర్లను విరగదీసింది. జహీర్ ఖాన్ ఇషాంత్ శర్మలను శ్రీలంక ఓపెనర్లు ఒక ఆట ఆడుకున్నారు. 23 ఓవర్లలో ఒకే ఒక వికెట్టు పోగొట్టుకుని 165 పరుగులు చేసిన శ్రీలంక ఊపును చూస్తే మరోసారి నాలుగొందల పరుగులు ఖాయమని అనిపించింది. కానీ స్పిన్నర్లు బంతిని అందుకోవడంతో శ్రీలంక బ్యాట్స్ మెన్లకు పగ్గాలు పడ్డాయి. తరువాత తొమ్మిది వికెట్లను కేవలం 74 పరుగులకే సమర్పించుకుని 44.2 ఓవర్లకు 239 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టీమిండియా కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చి కేవలం 28 బంతుల్లోనే 44 పరుగులు చేసేసి, తనపని తాను చేసుకుని త్వరగానే డ్రసింగ్ రూంకి తిరిగి వచ్చేశాడు. తరువాత గంభీర్(32) తోనూ, యువరాజ్ తోను, దినేష్ కార్తిక్(36నాటౌట్) సాయంతోనూ పరుగుల రారాజు టెండూల్కర్ మిగతా పనిని పూర్తి చేశాడు. 104 బంతులను ఎదుర్కొన్న ఈ ఓపెనర్ 96 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
News Posted: 21 December, 2009
|