భారత్ లక్ష్యం 316 కోల్ కతా : ఇక్కడి ఈడెన్ గార్డెన్ లో భారత్ తో గురువారం జరుగుతున్న జరుగుతున్న నాలుగో వన్డే (డే అండ్ నైట్)లో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. భారత్ కు 316 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్ ఉపుల్ తరంగ 128 బంతుల్లో రెండు సిక్సర్లు, 14 బౌండరీల సాయంతో 118 పరుగులు చేసి జహీర్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ 19 బంతుల్లో ఒక బౌడరీ సాయంతో 9 పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో విరాట్ కొహ్లీకి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా మైదానం నుంచి బయటికి నడిచాడు. సనత్ జయసూర్య 15 బంతుల్లో 15 పరుగులు చేసి జహీర్ ఖాన్ బౌలింగ్ లోనే టెండుల్కర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ / కీపర్ కుమార సంగక్కర 60 పరుగులు చేసి హర్భజన్ బౌలింగ్ లో దొరికిపోయాడు. 72 బందులు ఆడిన సంకక్కర ఐదు బౌండరీలు చేసిన అనంతరం దినేష్ కార్తీక్ చేతిలో స్టంప్డ్ ఔట్ అయ్యాడు. మహేల జయవర్దనె 30 బంతుల్లో 33 పరుగులు చేసి రన్నౌట్ అయ్యాడు. తిస్సార పెరీరా కేవలం 14 బంతులు ఆడి ఒక సిక్సర్, 4 బౌండరీలతో 31 పరుగులు చేసి నెహ్రా బంతిని రవీంద్ర జడేజా చేతికి కొట్టి ఔటైపోయాడు. తిలిన కాందంబె 23 పరుగులతోను, తిలన్ సమరవీర 13 పరుగులతోనూ క్రీజ్ వద్ద ఉన్నారు.
కాగా ఫ్లడ్ లైట్లు మొండికేయడంతో వన్డేకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆట 49.2వ ఓవర్ వద్ద ఆటను వెలుతురు లేని కారణంగా అంపైర్ నిలిపివేశారు. కొద్దిసేపటి తరువాత లైట్లు పనిచేయడంతో మిగిలిన 4 బంతులు ఆటతో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలింగ్ లో జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్భజన్ సింగ్ కు ఒక వికెట్ దొరికింది.
News Posted: 24 December, 2009
|