భారత్ ఖాతాలో సీరీస్ కోల్ కతా : విజయాల నాయకుడు ధనాధన్ ధోనీ లేడు. సిక్సర్ల చిచ్చరపిడుగు యువరాజ్ సింగూ లేడు. వీర బాదుడు వీరేంద్రుడు పది పరుగులకే ఔట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎనిమిది పరుగులకే వెనుతిరిగాడు. కళ్లెదురుగా శ్రీలంక పెట్టిన లక్ష్యం 315 పరుగులు. తారలు లేకపోయినా టీమిండియా ఈడెన్ గార్డెన్ లో అలవోక విజయం సాధించి వన్డే సీరీస్ ను కైవసం చేసుకుంది. మేరునగధీరునిలా గంభీర్ ఈ మ్యాచ్ ను శిల్పం చెక్కినట్లు చెక్కాడు. యువకుడు విరాట్ కోహ్లి సవ్యసాచిలా గంభీర్ కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి స్కోరును కొలిచినట్టు కొట్టారు. ఉరుములు, మెరుపులు లేకుండా ప్రశాంత తుపానులా విరుచుకుపడి ఇద్దరూ సెంచరీలు సాధించారు. 150 పరుగులు చేసి గంభీర్ నాటౌట్ గా నిలిచాడు. 23 పరుగులకే సెహ్వాగ్, సచిన్ లు ఔటయిపోయిన తరుణంలో మూడో వికెట్ కు 224 పరుగులు జోడించిన అనంతరం విరాట్ కొహ్లి 107 పరుగులు చేసి విజయాన్ని కనుచూపు మేరలోకి తీసుకువచ్చి వెనుతిరిగాడు. మూడేళ్ళ తరువాత వన్డే మ్యాచ్ కు ఆతిధ్యం ఇచ్చిన ఈడెన్ గార్డెన్ లో గురువారం టీమిండియా సాధించిన ఈ విజయాన్ని కోల్ కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీకి అంకితం ఇచ్చారు.
శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్ తరంగ సెంచరీ, కెప్టన్ సంగక్కర 60 పరుగులు, పెరెరా 14 బంతుల్లో 31పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ సాయంతో 50 ఓవర్లలో 315 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఈ స్కోరును కేవలం 48.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి అధిగమించిన భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ తో గంభీర్ మూడువేల పరుగుల క్లబ్ లో చేరాడు. తన 150 పరుగులను 137 బంతుల్లో చేశాడు. మొత్తం 14 బంతులను బౌండరీకి తరలించాడు. సచిన్ పెవిలియన్ ముఖం పట్టిన తరువాత గంభీర్ కు జత కలసిన విరాట్ కొహ్లీ 114 బంతులను ఎదుర్కొని ఒక సిక్స్, 11 బౌండరీల సాయంతో 107 పరుగులు చేసి తన ఖాతాలో మొట్టమొదటి సెంచరీని జమ చేసుకున్నాడు. ఈ విజయంతో ఇండియా ఐదు వన్డేల సీరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం నాడు ఐదో వన్డే ఢిల్లీలో జరగనుంది.
News Posted: 24 December, 2009
|