ఢిల్లీ వన్డే రద్దు న్యూఢిల్లీ : ఫిరోజ్ షా కోట్లా పిచ్ సరిగా లేదంటూ శ్రీలంక కెప్టెన్ చేసిన ఫిర్యాదుతో ఇక్కడ ఆదివారం జరుగుతున్న ఐదవ వన్డే రద్దయింది. లంక కెప్టెన్ ఫిర్యాదుతో అంపైర్లు మైదానాన్ని నిశితంగా పరిశీలించి మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆట రద్దయే సమయానికి శ్రీలంక 23.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 83 పరుగులు చేసింది. బంతులు విపరీతంగా బౌన్స్ అయిపోతూ లంక బ్యాట్స్ మెన్ ఇద్దరు గాయపడడంతో లంక కెప్టన్ కుమార సంగక్కర అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. లంక ఓపెనింగ్ బ్యాట్స్ మన్ ఉపుల్ తరంగా 0, దిల్షాన్ 20, సనత్ జయసూర్య 31, కుమార సంగక్కర 1, సమరవీర 2 పరుగులకు ఔటైపోయారు. కాందంబె 12, పుష్పకుమార 7 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా, హర్భజన్ సింగ్, సుదీప్ త్యాగి చెరో వికెట్ తీసుకున్నారు. సమరవీరను సురేష్ రైనా రన్నౌట్ చేశాడు. మొత్తం మీద ఫిరోజ్ షా కోట్లా పిచ్ మ్యాచ్ నిర్వహించేందుకు అనువుగా లేదంటూ రద్దు చేశారు.
News Posted: 27 December, 2009
|