శ్రీలంక 7 వికెట్ల విజయం మిర్ పూర్ : ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఆతిధేయ బంగ్లాదేశ్ జట్టుతో సోమవారం జరిగిన ముక్కోణపు వన్డేల సీరీస్ తొలి వన్డే (డే / నైట్) మ్యాచ్ ను శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక బంగ్లాదేశ్ ను నిర్ణీత 50 ఓవర్లలో 260 పరుగులకు కట్టడి చేసింది. 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టు ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ ధీరోచిత క్రీడా నైపుణ్యం (104 పరుగులు + ఒక వికెట్)తోను, కెప్టెన్ సంగక్కర వేగవంతంగా చేసిన పరుగులతోను ఇంకా 5.1 ఓవర్లు మిగిలి ఉండగానే తొలి వన్డేను తన ఖాతాలో వేసుకుంది. ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన తిలకరత్నె దిల్షాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
ఉపుల్ తరంగ - తిలకరత్నె దిల్షాన్ లతో విజయానికి కావలసిన 261 పరుగుల వేట ప్రారంభించిన శ్రీలంక 3.5వ ఓవర్ లోనే తరంగ వికెట్ ను కోల్పోయింది. అప్పటికి లంక స్కోర్ 35 పరుగులుండగా తరంగ వ్యక్తిగత స్కోర్ 14. మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న తరంగ స్కోర్ లో 3 బౌండరీలున్నాయి. హోసయిన్ వేసిన బంతిని ఎం. రహీమ్ కు క్యాచ్ ఇచ్చిన తరంగ పెవిలియన్ చేరుకున్నాడు. ఇక వన్ డౌన్ లో బరిలోకి వచ్చిన లంక కెప్టెన్ కుమార సంగక్కర అప్పటికే క్రీజ్ వద్ద స్థిరంగా ఉన్న దిల్షాన్ కు తోడయ్యాడు. ఇరువురు లంకేయులు బంగ్లా బౌలర్ల బంతులను ఎడాపెడా బాదుతూ పరుగుల వేగాన్ని పెంచారు. అయితే, ఆట 29.1వ ఓవర్ వద్ద లంక కెప్టెన్ సంగక్కర షఫియుల్ వేసిన బంతిని ఎం. రహీమ్ చేతికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి లంక స్కోర్ 183 పరుగులు కాగా సంగక్కర వ్యక్తిగత స్కోర్ 74. మొత్తం 73 బంతులు ఎదుర్కొన్న సంగక్కర స్కోర్ లో 10 బౌండరీలున్నాయి. టూ డౌన్ లో థిలన్ సమరవీర వచ్చి దిల్షాన్ కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కూడా బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఆట 41.5వ ఓవర్ లో మహ్మదుల్లా వేసిన బంతిని ఎన్. ఇస్లాంకు క్యాచ్ ఇచ్చిన లంక హీరో దిల్షాన్ వెనుదిరిగాడు. మొత్తం 122 బంతులు ఆడిన దిల్షాన్ 104 పరుగులు చేశాడు. దిల్షాన్ స్కోర్ లో 12 బౌండరీలున్నాయి. దిల్షాన్ పెవిలియన్ చేరడంతో చమరసిల్వ వచ్చి సమరవీరతో జతకలిశాడు. విజయానికి కావలసిన మిగతా పరుగులను వీరద్దరూ సాధించారు. సమరవీర 41 పరుగులతోను, సిల్వ 4 పలుగులతోను నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు.
బంగ్లాదేశ్ బౌలింగ్ లో షఫుల్ ఇస్లాం, రుబెల్ హొస్సయిన్, ఎం. మహ్మదుల్లా తలో వికెట్ తీసుకున్నారు.
News Posted: 4 January, 2010
|