రంజీ బ్యాట్ చోరీ అహ్మదాబాద్ : పుంఖానుపుంఖంగా పరుగులు సాధించిన బ్యాట్ చోరుల హస్తగతమైంది.రంజిత్ సింహ్ జీ బ్యాట్ ను ఆయన రాజభవనంలో నుంచి అపహరించారు. అహ్మదాబాద్ కు 300 కిలో మీటర్ల దూరంలోని జామ్ నగర్ లో ఆ చారిత్రక క్రికెటర్ పూర్వీకుల నివాస భవనంలోకి దొంగలు చొరబడి 15 గదులలో సర్వం చిందరవందర చేసి, పెయింటింగ్ లను ధ్వంసం చేశారని, ప్రాచీన కళాఖండాలను చేజిక్కించుకుని పరారయ్యారని పోలీసులు సోమవారం వెల్లడించారు.
ఆ రాజప్రాసాదం 'జామ్ బంగళా' వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బంది ఈ దొంగతనం జరిగిన సంగతిని సోమవారం ఉదయం పసిగట్టి పోలీసులను పిలిపించారు. ఈ దోపిడీ బహుశా గత పక్షం రోజులలో గాని నెల రోజులలో గాని జరిగి ఉండవచ్చునని అధికారులు పేర్కొన్నారు. 'ఖరీదైన వస్తువులు ఎన్ని చోరీ అయ్యాయో మాకు కచ్చితంగా తెలియదు. దొంగతనం జరిగిందని మాత్రమే ఇప్పుడు మాకు తెలుసు' అని పోలీస్ అధికారి కశ్యప్ భట్ చెప్పారు.
చోరీ అయిన వస్తువులలో అధిక భాగం రంజీకి చెందినవని పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిలో ఒక బ్యాట్ ఉందని ఆ వర్గాలు ధ్రువీకరించాయి. ఆ బ్యాట్ రంజీ ఆధిపత్యం చలాయించిన 1890, 1900ల నాటిదా అనేది, ఆయన ఏదైనా టెస్ట్ లో దానిని ఉపయోగించారా అనేది స్పష్టంగా తెలియరాలేదు. క్రికెట్ కు 'స్వర్ణ శకం'గా పరిగణించిన ఆ కాలంలో రంజీ ప్రపంచం అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా గణుతికెక్కారు.ఆ ప్యాలెస్ లో వజ్ర ఖచిత కిరీటం, కత్తులు, వర్ణ చిత్రాలు వంటి విలువై వస్తువులు అనేకం ఉన్నాయని, ఆ వస్తువులలో చాలా వాటిని దొంగలు పాడు చేశారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, పెక్కు సంవత్సరాలుగా ఆ సువిశాలమైన ప్యాలెస్ లో ఎవరూ నివసించడం లేదు.
కె.ఎస్. రంజిత్ సింహ్జీ (1872-1933) నవానగర్ (ప్రస్తుతం జామ్ నగర్) పాలకుడుగా లేదా జామ్ సాహెబ్ గా ఉన్నారు. ఆయన ఇంగ్లండ్ తరఫున టెస్ట్ లు ఆడారు. 'లెగ్ గ్లాన్స్' సృష్టికర్త ఆయనే. మహాత్మా గాంధి రంగ ప్రవేశానికి ముందు రంజిత్ సింహ్జీని అత్యంత ప్రముఖ భారతీయునిగా పేర్కొనేవారు. దేశంలోని సుప్రసిద్ధ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన పేరు మీదే (రంజీ ట్రోఫీగా) నిర్వహిస్తున్నారు.ఆ ప్యాలెస్ ప్రస్తుత యజమాని, రంజీ వారసుడు జామ్ షాతుసలియాజీ జడేజా తాను నివసిస్తున్న ముంబై నుంచి వచ్చిన తరువాతే ప్యాలెస్ లో చోరీ అయిన వస్తువులు ఏవో కచ్చితంగా తెలియగలదు.
News Posted: 5 January, 2010
|