ఫీల్డింగ్ ఎంచుకున్న లంక మిర్ పూర్ (బంగ్లాదేశ్) : స్థానిక షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న వన్డే ముక్కోణపు సీరీస్ రెండో మ్యాచ్ (డే / నైట్)లో శ్రీలంక టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. సోమవారం జరిగిన తొలి వన్డేను గెలుచుకున్న ఉత్సాహంలో శ్రీలంక ఈ రోజు కూడా అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితమే స్వదేశంలో ఇదే శ్రీలంక జట్టుతో టెస్ట్, వన్డే మ్యాచ్ ల సీరీస్ లను గెలుచుకున్న భారత్ అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగింది. కాగా కండరాల గాయం వల్ల శ్రీలంక డాషింగ్ ఓపెనర్ దిల్షాన్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.
గౌతం గంభీర్ - వీరేంద్ర సెహ్వాగ్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 2.6వ ఓవర్ వద్ద గంభీర్ వికెట్ ను కోల్పోయింది. కేవలం 14 పరుగుల వద్ద ఉన్న భారత్ ఓపెనింగ్ జంటను వెలెగెదెర రూపంలో విడగొట్టింది. వెలెగెదెర విసిరిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన గంభీర్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఔటయ్యే సమయానికి గంభీర్ 12 బంతులు ఆడి ఒక బౌండరీ సాయంతో 8 పరుగులు చేశాడు.
News Posted: 5 January, 2010
|