భారత్ 279/9 మీర్ పూర్ (బంగ్లాదేశ్) : శ్రీలంకతో ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న ముక్కోణపు సీరీస్ రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ లోని మొదటి మూడు వికెట్లు (గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లి) వికెట్లనే కాకుండా సురేష్ రైనా, జహీర్ ఖాన్ వికెట్లను కూడా చణక వెలెగెదెర పడగొట్టి భారత్ మరింత అత్యధికంగా స్కోర్ చేయకుండా నిలువరించగలిగాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక కెప్టెన్ కుమార సంగక్కర ఆహ్వానం మేరకు భారత్ గౌతం గంభీర్ - వీరేంద్ర సెహ్వాగ్ లతో తన ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట 2.6వ ఓవర్ వద్ద భారత ఓపెనర్ గంభీర్ వికెట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు చణక వెలెగెదెర. వన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన విరాట్ కొహ్లి వికెట్ ను కూడా వెలెగెదెర ఆట 6.5వ ఓవర్ వద్ద బలి తీసుకున్నాడు. అప్పటికి భారత్ స్కోర్ 62 పరుగులు కాగా కొహ్లీ వ్యక్తిగత స్కోర్ 9. టూ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి వీరేంద్ర సెహ్వాగ్ కు జత కలిశాడు. ఆట 8.4వ ఓవర్ వద్ద వీరేంద్ర సెహ్వాగ్ ను కూడా వెలెగెదెర తికమక పెట్టి మైదానం బయటికి పంపించాడు. 31 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ 9 బౌండరీల సాయంతో 47 పరుగులు చేశాడు. సెహ్వాగ్ స్థానంలో కెప్టెన్ ధోనీ యువరాజ్ సింగ్ కు తోడుగా నిలిచాడు. ఇద్దరూ చెరో పక్కన లంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోర్ ను పరుగు పెట్టించారు. అయితే, యువీకి తోడుగా నిలిచి బాధ్యతగా ఆడుతున్న ధోనీ లంక బౌలర్ పెరీరా బంతిని తప్పుగా అర్థం చేసుకొని సంగక్కరకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. అప్పటికి ఆట 31.2వ ఓవర్ వద్ద భారత్ స్కోర్ 170 పరుగులుగా ఉంది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సురేష్ రైనా 46 బంతుల్లో 35 పరుగులు చేసి వెలెగెదెర బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 263 పరుగులు ఉంది. రైనా స్కోర్ లో 4 బౌండరీలున్నాయి. దూకుడుగా ఆడుతున్న యువరాజ్ వికెట్ ను పెరీరా బంతి బలి తీసుకుంది. ఆట 37.5వ ఓవర్ వద్ద పెరీరా బంతిని కొట్టిన యువీ ఎస్. లక్మల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం 84 బంతులు ఎదుర్కొన్న యువీ రెండు సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 74 పరుగులు చేశాడు. తరువాత క్రీజ్ వద్దకు వచ్చిన హర్భజన్ సింగ్ 1, జహీర్ ఖాన్ 2 పరుగులకే వికెట్లు అప్పగించి వెనుదిరిగారు. ఆశిష్ నెహ్రా 4 పరుగులుతోను, శ్రీశాంత్ ఒక్క పరుగుతోనూ నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు.
లంక బౌలింగ్ లో ఒక్క వెలెగెదెర ఐదు భారత వికెట్లను తుత్తునియలు చేశాడు. థిలన్ తుషార, థిస్సార పెరీరా చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు.
News Posted: 5 January, 2010
|