భారత్ ఘన విజయం మీర్ పూర్ (బంగ్లాదేశ్) : మహేంద్ర సింగ్ ధోనీ అన్ బీటెన్ సెంచరీ కెప్టెన్ ఇన్నింగ్స్, విరాట్ కొహ్లీ వేగవంతమైన 91 పరుగులు, 43 బంతుల్లో 51 పరుగులు చేసిన సురేష్ రైనా దూకుడుతో భారత్ కు 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించిపెట్టారు. ముక్కోణపు వన్డే సీరీస్ లో భాగంగా గురువారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఆతిధేయ బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ తన ఆధిక్యాన్ని, అనుభవాన్ని ప్రదర్శించింది. కష్టాల్లో ఉందనుకున్న టీమిండియా విజయానికి బాటలు వేసిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. సునాయాసం చేసి పసికూన బంగ్లాదేశ్ జట్టే కదా అనుకున్న వారికి పెద్ద షాక్ ఇస్తూ టీమిండియా ముందు 297 పరుగులు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. భారత జట్టుపై బంగ్లాదేశ్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం.
సమాధానంగా 297 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన ధోనీ సేన 47.3వ ఓవర్ వద్దే ఫలితాన్ని తన ఖాతాలో రాసుకుంది. నాలుగు వికెట్లు నష్టపోయిన భారత్ ఈ సీరీస్ లో తొలి విజయం సాధించింది. గౌతం గంభీర్ - వీరేంద్ర సెహ్వాగ్ లతో పరుగుల వేట ప్రారంభించిన ఇండియా మొదట్లో తడబడింది. కేవలం 13 పరుగులకే వీరేంద్ర సెహ్వాగ్, 18 పరుగులకే గౌతం గంభీర్ ఔటయిపోవడం భారత్ కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే ఒన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన విరాట్ కొహ్లీ బంగ్లా బౌలర్లను ధాటిగా ఎదుర్కొని ఎదురుదాడికి దిగాడు. 102 బంతులు ఎదుర్కొని 7 బౌండరీల సాయంతో 91 పరుగులు చేశాడు. టూ డౌన్ లో వచ్చిన యువరాజ్ సింగ్ అనూహ్యంగా ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ వద్దకు వచ్చిన కెప్టెన్ ధోనీ విరాట్ కొహ్లీ అవగాహనతో ఆడుతూ, వికెట్లను కాపాడుకుంటూ భారత్ ను విజయ తీరాలవైపు పరుగు తీయించారు. అయితే, ఆట 34.6వ ఓవర్ వద్ద విరాట్ కొహ్లీ సఖీబుల్ బంతికి కాట్ అండ్ బౌల్డ్ అయి మైదానం నుంచి బయటికి వచ్చాడు. అనంతరం బరిలోకి వచ్చిన సురేష్ రైనా - ధోనీ కలిసి విజయానికి కావలసిన పరుగులను సాధించారు. 107 బంతులు ఎదుర్కొన్న ధోనీ 9 బౌండరీల సాయంతో 101 పరుగులు చేయగా, రైనా 43 బంతులు ఆడి ఒక సిక్సర్, 5 బౌండరీలతో 51 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ బౌలింగ్ లో సయీద్ రసెల్, రూబెల్ హోసయిన్, సఖీబ్ హసన్ తలో వికెట్ పడగొట్టారు. వీరేంద్ర సెహ్వాగ్ ను రజ్జాక్ రన్నౌట్ చేశాడు. మొత్తం మీద భారత్ విజయానికి కావలసిన 297 పరుగులను 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే సాధించింది.
News Posted: 7 January, 2010
|