హాకీలో తిరుగుబాటు న్యూఢిల్లీ : భారత హాకీ క్రీడాకారులు జట్టు సారథి రాజ్ పాల్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ప్రాక్టీస్ కు హాజరు కావడానికి నిరాకరించారు. తమ వేతనం డిమాండ్లను తీర్చనిదే తాము ప్రాక్టీస్ కు రాబోమని వారు స్పష్టం చేశారు. హాకీ ఇండియా (హెచ్ఐ) తమ బకాయిలను చెల్లించకపోవడం పట్ల భారత క్రీడాకారులు ఆగ్రహం చెందారు. 'జీతం కోరుతూ మేము రాసిన లేఖకు హాకీ ఇండియా స్పందించలేదు. క్రీడాకారులు ఈరోజు నుంచి ఆడరాదని మేము నిశ్చయించుకున్నాం' అని రాజ్ పాల్ చెప్పాడు.
ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు హాకీ ఇండియా సమాఖ్య ఢిల్లీకి రావలసిందని కోరిన మీదట సమాఖ్య అధ్యక్షుడు ఎ.కె. మట్టూను కలుసుకునేందుకు అసిస్టెంట్ కోచ్ హరేందర్ సింగ్, కొందరు క్రీడాకారులు శనివారం ఢిల్లీ వస్తున్నారు.క్రీడాకారుల లేఖకు స్పందనగా మట్టూ వారిని చర్చలకు ఆహ్వానించారు. హాకీ ఇండియా సానుభూతితో ఉందని, క్రీడాకారుల సిసలైన డిమాండ్లను అంగీకరించేందుకు సిద్ధంగా ఉందని మట్టూ తెలిపారు. అర్జెంటైనాలో ఇటీవల ముగిసిన చాంపియన్స్ చాలెంజ్ వన్ టోర్నమెంట్ కు సంబంధించిన తమ మ్యాచ్ ఫీజును చెల్లించని పక్షంలో తాము పుణెలో ప్రస్తుత శిక్షణ శిబిరం నుంచి తప్పుకుంటామని భారత క్రీడాకారులు ఇంతకుముందు బెదరించారు. మ్యాచ్ ఫీజు చెల్లింపులో జాప్యం పట్ల సీనియర్ క్రీడాకారులు ఆగ్రహం చెందారు. ఏడు రోజులలోగా ఆ డబ్బు చెల్లించాలని కోరుతూ వారు మట్టూకు లేఖ రాశారు.
గతంలో తమకు ముందుగానే డబ్బు చెల్లించారని, కాని ఈ పర్యాయం టోర్నమెంట్ ముగిసిన తరువాత కూడా ఫీజు చెల్లించలేదని క్రీడాకారులు తెలియజేశారు. 'అర్జెంటైనాలో చాంపియన్స్ చాలెంజ్ టోర్నీకి సంబంధించిన మా డబ్బును మాకు చెల్లించవలసిందిగా అభ్యర్థిస్తున్నా. ఇంతకుముందు మూడేళ్లలో ప్రతి టోర్నమెంట్ కు మేము దేశం నంచి బయలుదేరే లోపలే మాకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించారు. ఈ సారి కూడా అలా చెల్లింపులు జరగాలని మా ఆకాంక్ష. భవిష్యత్తులో టోర్నమెంట్లకు సంబంధించి ముందుగానే చెల్లించేందుకు ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రార్థన' అని క్రీడాకారులు తమ లేఖలో పేర్కొన్నారు.క్రితం నెల అర్జెంటైనాలోని సాల్టాలో జరిగిన ఈ టోర్నమెంట్ లో ఇండియా కాంస్య పతకం గెలుచుకున్నది.
News Posted: 8 January, 2010
|