ఫైనల్లో లంక మిర్ పూర్ : వరుసగా మూడో వన్డేలో కూడా విజయం సాధించడంతో శ్రీలంక జట్టు ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో చేరింది. బంగ్లాదేశ్ తో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ ల నష్టానికి 249 పరుగులు చేసింది. బ్యాట్స్ మ్యాన్ లలో ఒక్కరూ కూడా కనీసం అర్థ సంచరీ కూడా నమోదు చేయకపోవడం విశేషం. ఒక దశలో 42 ఓవర్లకు 199 పరుగులకు ఐదు వికెట్ లు కోల్పోయిన బంగ్లా జట్టు 270 పరుగుల స్కోరు చేస్తుందని అంతా అంచనా వేసారు. అయితే చివర నిమిషంలో లంక బౌలర్లు పటిష్టంగా బౌలింగ్ చేయడంతో 249 కే స్కోరు పరిమితమయింది. నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులు ఆది నుండే బ్యాట్ ను ధాటిగా ఆడారు. ఔపెనింగా ఆటగాళ్లుగా బరిలోకి దిగిన ఉపుల్ తరంగ, మహేల జయవర్థనేలు రికార్డ్ స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 215 పరుగులు సాధించారు. ఉపుల్ తరంగ 118 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు. ఆలాగే మహేల జయవర్థనే కూడా ధాటిగా ఆడి 108 పరుగులు సాధించి ఔట్ కాగా, సంగక్కర బ్యాటింగ్ కు దిగి మిగిలిన పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా ఉన్న తరంగకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
News Posted: 8 January, 2010
|