భారత్ లక్ష్యం 214 మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్ లోని కీలక ఐదవ వన్డేలో భారత్ 214 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తోంది. భారత బౌలర్లు జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా లంక బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడేసి వికెట్లు పడగొట్టడం, భారత జట్టు ఫీల్డింగ్ లో రాణించడంతో లంకేయులను 213 వద్దే కట్టడి చేశారు. లంకేయులను భారత బౌలర్లు ఫీల్డర్లు 46.1 ఓవర్లకే ఆలౌట్ చేసి లక్ష్యాన్ని వీలైనంత తక్కువ ఉండేలా చూసుకున్నారు.
టాస్ గెలిచిన శ్రీలంక జట్టు భారత్ ను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఉపుల్ తరంగ, తిలకరత్నె దిల్షాన్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన లంక అనూహ్యంగా తొలి ఓవర్ లోనే ఉపుల్ తరంగ (0) వికెట్ ను బలి ఇచ్చింది. సుదీప్ త్యాగి బంతిని దినేష్ కార్తీక్ చేతిలోకి కొట్టి తరంగ పెవిలియన్ చేరాడు. లంక బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ సంగక్కర (68), సూరజ్ రణ్ దివ్ (56) అర్ధ సెంచరీలు దాటగలిగి, భారత బౌలింగ్ ధాటిని కొద్దిగా ఎదుర్కొనగలిగారు. మిగిలి ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ సమీపంలోకి కూడా రాకపోవడంతో 213 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. తిలకరత్నె దిల్షాన్ 33, మహేల జయవర్దనె 5, తిలన్ సమరవీర (0), తిలిన కాందంబె 1 (రన్నౌట్), తిస్సార పెరీరా 11, తిలిన తుషార 28, చణక వెలెగెదెర 1 పరుగులు చేశారు. సురంగ లక్మల్ పరుగులేవీ లేకుండా నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఎగ్ స్ట్రాలు 10 పరుగులతో శ్రీలంక మొత్తం 213 పరుగులు చేసింది.
భారత బౌలింగ్ లో జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా చెరో మూడేసి వికెట్లను పడగొట్టారు. సుదీప్ త్యాగి, ఎస్. శ్రీశాంత్, యువరాజ్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.
News Posted: 10 January, 2010
|