టీమిండియా ఘన విజయం మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ముక్కోణపు వన్డే సీరీస్ లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన కీలక 5వ వన్డేలో భారత్ 8 వికెట్ల భారీ తేడాతో గెలిచింది. అటు ఫీల్డింగ్ లోను, ఇటు బ్యాటింగ్ లోనూ భారత క్రీడాకారులు చక్కగా రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది. ఇంతకు ముందు వరకూ ఆడిన మూడు వన్డేలనూ గెలిచిన శ్రీలంక 12 పాయింట్లతో సీరీస్ ఫైనల్లో ఆడేందుకు బెర్త్ రిజర్వ్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, భారత్ ఈ విజయంతో రెండు వన్డేల్లో నెగ్గి 8 పాయింటలో రెండో స్థానంలో ఉంది. పది ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇవ్వడమే కాకుండా రెండు మేడిన్ ఓవర్లు కూడా వేసి, మూడు కీలకమైన లంక వికెట్లను పడగొట్టిన జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 32.4వ ఓవర్ లోనే విజయాన్ని తన ఖాతాలో జమచేసుకుంది. ఓపెనర్లు దినేష్ కార్తీక్ 40 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. కార్తీక్ స్కోర్ లో 9 బండరీలున్నాయి. ఆట 11.3వ ఓవర్ వద్ద తుషార వేసిన బంతిని లంక కెప్టెన్ సంగక్కరకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోర్ 89 పరుగులు. వన్ డౌన్ లో విరాట్ కొహ్లీ వచ్చి రెండో ఓపెనర్ గౌతం గంభీర్ కు జత కలిశాడు. మొత్తం 86 బంతులు ఆడిన గౌతం గంభీర్ 10 బౌండరీల సాయంతో 71 పరుగులు చేశాడు. ఆట 28.3వ ఓవర్ లో భారత్ స్కోర్ 161 పరుగుల వద్ద ఉండగా పెరీరా బంతిని ఆడిన గంభీర్ వెలెగెదెరకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక విజయానికి అవసరమైన పరుగులను టూ డౌన్ లో బరిలోకి వచ్చిన యువరాజ్ సింగ్, విరాట్ కొహ్లీ సునాయాసంగా చేశారు. విరాట్ కొహ్లీ 68 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.. కొహ్లీ స్కోర్ లో 9 బౌండరీలున్నాయి. ఏడు బంతులు ఆడిన యువీ 8 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కొహ్లీ - యువీ మొత్తం 4.1 ఓవర్లు ఆడి 53 పరుగుల భాగస్వామ్యం చేశారు.
లంక బౌలింగ్ లో తిలన్ తుషార, తిస్సార పెరీరా చెరో వికెట్ తీసుకున్నారు.
News Posted: 10 January, 2010
|