బంగ్లాదేశ్ 247/6 మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ముక్కోణపు వన్డే సీరీస్ 6వ మ్యాచ్ లో టీమిండియాకు ఆతిధేయ బంగ్లాదేశ్ జట్టు 248 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మీర్ పూర్ లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో సోమవారం జరుగుతున్న వన్డేలో భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. ధోనీ ఆహ్వానం మేరకు బరిలో దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ సఖీబుల్ హస్సన్ 85, ఎం. మహ్మదుల్లా 64 నాటౌట్, నయీం ఇస్లాం 14 బంతుల్లో 22 పరుగులు నాటౌట్ తప్ప మిగతా వారు విఫలమయ్యారు.
ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ 17, ఇమ్రుల్ కయీస్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. ఎం. అష్రఫుల్ 4, రఖీబుల్ హస్సన్ 28, ముష్ఫికర్ రహీం 7 పరుగులు చేశారు. తమ దేశంలోనే జరిగిన ఈ సీరీస్ లో దారుణంగా ఓటములు చవిచూసిన బంగ్లాదేశ్ జట్టు కనీసం ఈ ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. అయితే, ఈ సీరీస్ లో ఫైనల్లో శ్రీలంకతో తలపడేందుకు 8 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ కూడా గెలిచి 12 పాయింట్లతో లంకతో సమానంగా ఫైనల్ బరిలో దిగాలని ఉవ్విళ్ళూరుతున్నది.
భారత్ బౌలింగ్ లో ఆశిష్ నెహ్రా 2 వికెట్లు పడగొట్టాడు. సుదీప్ త్యాగి, ఎస్. శ్రీశాంత్, యువరాజ్ సింగ్ లకు తలో ఒక వికెట్ దొరికింది. రఖీబుల్ హస్సన్ ను యువరాజ్ సింగ్ రన్నౌట్ చేశాడు.
News Posted: 11 January, 2010
|