ముక్కోణపు ఫైనల్ నేడు మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ఐడియా కప్ ముక్కోణపు వన్డే క్రికెట్ ఫైనల్ పోరు బుధవారం మధ్యాహ్నం ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ డే / నైట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. గత రెండేళ్ళలో ధోనీ సేనతో జరిగిన ఏ ఒక్క సీరీస్ నూ గెలుచుకోలేకపోయిన శ్రీలంక ఈ సీరీస్ ను అయినా ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో బరిలో దిగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న ఉత్సాహంతో ధోనీ సేన కదం తొక్కుతోంది. ఈ సీరీస్ ను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా ఈ సీజన్ ను శుభారంభం చేయాలని టీమిండియా ఉవ్విళ్ళురుతోంది.
ఈ సీరీస్ లో శ్రీలంకతో జనవరి 5న జరిగిన తొలి వన్డేలో ఓడిపోయిన భారత్ తిరిగి పుంజుకుని వరుసగా రెండు మ్యాచ్ లు ఆతిథేయ బంగ్లాదేశ్ పైన, మరో మ్యాచ్ శ్రీలంక పైన భారీ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీలంక భారత్, బంగ్లాదేశ్ లపై చెరో మ్యాచ్ లో విజయం సాధించి, ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఈ దృష్ట్యా చూస్తే నేటి ఫైనల్లో పోటీ పడుతున్న ఇరు జట్లూ సమఉజ్జీలుగా ఉన్నట్లే. అయితే, మూడు విజయాలు, ఒక్క పరాజయంతో ఇరు జట్లూ ఉన్నాయి. రెండు జట్లలోనూ బ్యాటింగ్ లైనప్ తిరుగు లేకుండా బ్రహ్మాండంగా ఉంది. బౌలింగ్ అంశంలోనే రెండు జట్లు కింద మీద అవుతున్నాయి.
కాగా, గత సంవత్సరం జరిగిన నాలుగు సీరీస్ లను గెలుచుకున్న ధోనీ సేన మంచి రికార్డుతో ఉంది. ఈ సీరీస్ కూడా నెగ్గాలన్న ఉత్సాహంతో టీమిండియా ఉంది. భారత బౌలింగ్ బలహీనతను తమ విజయానికి సోపానాలుగా మలచుకోవాలని లంకేయులు వ్యూహం వేసుకుంటుండగా, కేవలం బ్యాటింగ్ బలాన్ని, బలగాన్నే ధోనీ నమ్ముకొన్నాడు. సీరీస్ విజయం ఇరు జట్లకు కీలకంగా మారే అంశం ఫీల్డింగ్. ఫీల్డింగ్ లో రాణించిన జట్టుకే విజయావకాశాలు దక్కే వీలుంది.
News Posted: 13 January, 2010
|