రైనా సెంచరీ మీర్ పూర్ (బంగ్లాదేశ్) : క్రీజ్ వద్దకు వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లే వచ్చి ఔటైపోయి పెవిలియ్ కు వెళ్ళిపోతున్నా ఆ ఒక్కడే మొక్కవోని ధైర్యంతో ఆడాడు. భారత జట్టుకు బాసటగా నిలిచాడు. లంకేయులను ధాటిగా ఎదుర్కొంటూ సెంచరీ చేశాడు. తన అంతర్జాతీయ వన్డే కెరీర్ లో మూడో సెంచరీ చేశాడు. కేవలం 47 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు జారవిడుచుకొని జావగారిపోతున్న టీమిండియాకు కొండంత ధైర్యాన్నిచ్చాడు. ఒక సమయంలో అసలు భారత జట్టు వంద పరుగులైనా చేయగలుగుతుందా? నిర్ణీత 50 ఓవర్లూ క్రీజ్ ను వదలకుండా నిలబడగలుగుతుందా? అన్న ఆందోళనలు క్రికెట్ అభిమానుల్లో రేకెత్తిన సమయంలో భారత జట్టును తన సమయస్ఫూర్తితో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టారు. మొత్తం 48.2 ఓవర్లలో భారత్ 245 పరుగుల స్కోర్ చేయడంలో ఇంచుమించు సగం పరుగులు తానే అందించాడు. శ్రీలంకతో బుధవారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఐడియా వన్డే సీరీస్ ఫైనల్లో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా 115 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ 10 బౌండరీల సాయంతో 106 పరుగులు చేశాడు. ఆట 45.3 ఓవర్ వద్ద వెలెగెదెర వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకు 110 బంతుల్లో రైనా ఒక సిక్సర్, 9 బౌండరీలతో సెంచరీ చేశాడు. తిస్సార పెరీరా బౌలింగ్ లో రైనా వన్డేల్లో తన మూడో సెంచరీని పూర్తి చేశాడు.
News Posted: 13 January, 2010
|