సీరీస్ శ్రీలంక కైవసం మిర్ పూర్ (బంగ్లాదేశ్): ముక్కోణపు సీరీస్ ఫైనల్లో టీమిండియా చతికిల పడింది. ఈ సీరీస్ లో ఓటమి అనేదే తెలియని శ్రీలంక ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ప్రారంభం నుంచి ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యచ్ లోభారత్ పై నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక విజయాన్ని సాధించింది. షేరే బంగ్లా స్టేడియంలో బుధవారం డే అండ్ నైట్ మ్యాచ్ గా సాగిన ఈ ఫైనల్ లో జయవర్థనే వీరోచితంగా ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ కు దిగింది. ప్రారంభంలో భారత్ తడబడింది. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నిలువునా కూలింది. ఒక దశలో 47 పరుగులకే నాలుగు వికెట్ లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈ సమయంలో సురేశ్ రైనా 106 పరుగులో సెంచరీ చేసి జట్టును ఆదుకుని గౌరవప్రదమైన స్కోరును అందించాడు. వీరేందర్ సెహ్వాగ్ 27 బంతులు ఆడి 42 పరుగులు చేసాడు. చివరకు భారత జట్టు అతికష్టంగా 245 పరుగులు చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులు నిదానంగా ఆటను సాగించారు. జయవర్ధనే ఆరంభం నుండే ధాటిగా మ్యాచ్ లో 71 పరుగులు చేసాడు. దిల్షాన్ 49 పరుగులు చేయగా, సంగక్కర 55 పరుగులు చేసాడు.
News Posted: 13 January, 2010
|