సచిన్ సెంచరీ చిట్టగాంగ్ (బంగ్లాదేశ్) : ఇక్కడి జోహర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో ఆతిథేయ బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజున భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన టెస్ట్ కెరీర్ లో 44వ సెంచరీ సాధించాడు. తొలిరోజున టెస్ట్ క్రికెట్ లో 13 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకు ఎక్కిన సచిన్ 166 బంతుల్లో 105 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
బంగ్లాదేశ్ లో భారతజట్టు పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజున భారత్ 243 పరుగులకు ఆలౌట్ అయింది. 218 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో సోమవారం ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన భారత్ కేవలం 25 పరుగులు జోడించింది. గౌతం గంభీర్ 23, తాత్కాలిక కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ 52, రాహుల్ ద్రావిడ్ 4, సచిన్ టెండుల్కర్ 105, వివిఎస్ లక్ష్మణ్ 7, యువరాజ్ సింగ్ 12, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్) 0, అమిత్ మిశ్రా 14, జహీర్ ఖాన్ 11, ఇషాంత్ శర్మ 1, ఎస్. శ్రీశాంత్ 1 పరుగు చేశారు.
బంగ్లాదేశ్ బౌలింగ్ లో కెప్టెన్ సఖీబుల్ హస్సన్, షాహదత్ హొస్సయిన్ చెరో ఐదేసి వికెట్లు పడగొట్టారు.
News Posted: 18 January, 2010
|