బంగ్లాపై భారత్ జయకేతనం చిట్టగాంగ్ : ఇక్కడి జోహర్ అహ్మద్ చౌధురి క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ను భారత్ 113 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 415 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లాదేశ్ జట్టు చతికిలపడింది. భారతజట్టు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆతిథేయ బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ గురువారం మధ్యాహ్నం ముగిసింది. రెండు వికెట్లనష్టానికి 67 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో టెస్ట్ చివరి రోజు గురువారం ఉదయం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 301 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్ట్ చివరి రోజున బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తమ స్కోర్ కు 234 పరుగులు జతచేశారు. తొలి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా ఈ సీరీస్ లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సచిన్ టెండుల్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
బంగ్లా వికెట్లతో అమిత్ మిశ్రా, ఇశాంత్ శర్మ ఆటాడుకున్నారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 2.3వ ఓవర్ వద్ద ఓపెనర్ ఇమ్రుల్ కయీస్ వికెట్ ను తీయడం ద్వారా జహీర్ ఖాన్ బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆట 75.2వ ఓవర్ లో ముష్ఫికర్ రహీమ్ వికెట్ ను పడగొట్టడం ద్వారా అమిత్ మిశ్రా పూర్తి చేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లో ముష్పికర్ రహీం ఒక్కడే భారత బౌలర్ల ధాటికి ఎదురు నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. మొత్తం 115 బంతులు ఎదుర్కొన్న రహీం ఒక సిక్సర్, 17 బౌండరీల సాయంతో 101 పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తమిమ్ ఇక్బాల్ కూడా అర్ధసెంచరీ (52) పూర్తిచేసి తన జట్టుకు మంచి ధైర్యాన్నే ఇచ్చాడు. అనంతరం క్రీజ్ వద్దకు వచ్చిన బ్యాట్స్ మరెవ్వరూ మూడు పదుల స్కోర్ కూడా చేయలేక వికెట్లు అప్పగించి పెవిలియన్ కు చేరుకున్నారు.
స్కోర్ల వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 243.
భారత్ రెండో ఇన్నింగ్స్ : 413/8.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 242.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 301. (తమిమ్ ఇక్బాల్ 52, ఇమ్రుల్ కయీస్ 1, షహర్యార్ నఫీస్ 21, ఎం. అష్రఫుల్ 27, రఖీబుల్ హసన్ 13, సఖీబుల్ హసన్ 17, ముష్ఫికర్ రహీం 101, ఎం. మహ్మదుల్లా 20, సాహదత్ హొస్సయిన్ 24, షఫీయుల్ ఇస్లాం 8 పరుగులు చేయగా రుబెల్ హొస్సయిన్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఎగ్ స్ట్రాలు 13.)
భారత్ బౌలింగ్ : అమిత్ మిశ్రా 4 వికెట్ల పడగొట్టాడు. ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీశాడు. జహీర్ ఖాన్ 2, వీరేంద్ర సెహ్వాగ్ ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం మీద భారత్ 113 పరుగుల ఆధిక్యంతో తొలి టెస్ట్ మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకుంది.
News Posted: 21 January, 2010
|