ఐపిఎల్ పెట్టిన పాక్ చిచ్చు ఇస్లామాబాద్ : ఐపిఎల్ ఫ్రాంచైజీలు తమ క్రికెటర్లను వేలంతో పాడనందుకు ప్రతీకారంగా భారత ఎన్నికల సంఘం స్వర్ణోత్సవాలకు పార్లమెంటుసభ్యులను పంపించకూడదని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ నిర్ణయించింది. అలానే దేశంలో ఎక్కడా ఐపిఎల్ మ్యాచ్ లను ప్రసారం చేయబోమని పాకిస్తాన్ కేబుల్ ఆపరేటర్ల సంఘం తీర్మానించింది. కొన్ని వారాల క్రితం భారత బాక్సింగ్ జట్టు కరాచీ పోటీలకు వెళ్ళినప్పుడు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడటానికి మొదటి అడుగు పడిందని భావించారు. ఎందుకంటే ముంబయి దాడుల తరువాత పాకిస్తాన్ వెళ్ళిన మొదటి క్రీడా జట్టు అదే. కానీ ఐపిఎల్ వేలం మొత్తం పరిస్థితిని తారుమారు చేసింది. పాత చిచ్చులను తిరిగి రేపింది. ఈ ఐపిఎల్ వివాదం పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు. కానీ మంత్రులు మాత్రం వ్యక్తిగత వ్యాఖ్యానాలతో భారత్ పై విరుచకుపడుతున్నారు.
ఐపిఎల్ మ్యాచ్ లకు భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ మంత్రి స్పష్టంగా ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ మంత్రులు, క్రీడాకారులు, మాజీలు మాత్రం ఊరుకోవడం లేదు. ఐపిఎల్ ఫ్రాంచైజీలు పాక్ క్రికెటర్లను పాడని వివాదాన్ని రెండు దేశాల దౌత్య సంబంధాలకు ముడిపెట్టి, భారత్ కు తగిన గుణపాఠం చెబుతామని, సరైన సమాధానం ఇస్తామనే హెచ్చరికలు సైతం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య క్రికెట్ దౌత్య సంబంధాలను మెరుగుపరిచేదిగా ఉందని, వెంటనే భారత్ ప్రతినిధులను ఇక్కడకు పంపి, పాక్ క్రికెటర్లకు క్షమాపణలు చెప్పించి, వారిని ఐపిఎల్ మ్యాచ్ లకు ఆహ్వానించాలని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ సూచించారు. పాకిస్తాన్ తో శాంతియుతంగా ఉండటం పట్ల భారత్ ఉదాసీనంగా ఉందనే విషయాన్ని ఐపిఎల్ వేలం తేటతెల్లం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కు తగిన రీతిలో సమాధానం ఇస్తామని పాక్ క్రీడల మంత్రి ఇజాజ్ జక్రానీ హెచ్చరించారు.
దీనికి ప్రతీకారంగా భారత్ వేదికలపై 2011లో జరిగే అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లను పాకిస్తాన్ బహిష్కరించాలని రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన పాక్ క్రికెట్ హీరో ఇమ్రాన్ ఖాన్, పాకిస్తానీ క్రికెట్ ఉద్దండుడు జహీర్ అబ్బాస్ సలహా ఇచ్చారు. ఐపిఎల్ కు వ్యతిరేకంగా నేషనల్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని క్రీడల పార్లమెంటరీ కమిటీ నాయకుడు జంషెడ్ దాస్తీ ప్రకటించారు.
News Posted: 22 January, 2010
|