చెలరేగిన తమిమ్ మీర్ పూర్ (బంగ్లాదేశ్) : టీమిండియా సవాల్ కు ఆతిథేయ బంగ్లా జట్టు ఘాటుగానే సమాధానం చెబుతోంది. తొలి ఇన్నింగ్స్ లో తత్తరపడిన బంగ్లాదేశ్ మలి ఇన్నింగ్స్ ను కాస్త దూకుడుగా, మరికాస్త నిదానంగా కొనసాగిస్తోంది. కుర్ర జట్టే కదా ఆటాడేసుకుందామనుకున్న భారత బౌలింగ్ ను బంగ్లా ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ చెడుగుడు ఆడాడు. 183 బంతులు ఎదుర్కొన్న తమిమ్ 3 సిక్సర్లు, 18 బౌండరీల సాయంతో 151 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక్బాల్ తరువాత జునాయత్ సిద్దిఖీ 55 పరుగులు చేయడంతో బంగ్లా జట్టు భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు మంగళవారం తన రెండో ఇన్నింగ్స్ లో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ సమం చేయాలంటే మరో 83 పరుగులు చేయాల్సి ఉంది.
మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి మొత్తం 60 ఓవర్లు ఎదుర్కొన్న బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. సాహదత్ హొస్సయిన్, ఎం.అష్రఫుల్ రెండే పరుగులతో నైట్ వాచ్ మెన్ గా నిలిచారు. తొలి మూడు బంగ్లా వికెట్లనూ జహీర్ ఖాన్ తీసుకున్నాడు. అంతకు ముందు భారత్ మంగళవారం ఉదయం తన తొలి ఇన్నింగ్స్ ను 8 వికెట్ల నష్టానికి 544 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
News Posted: 26 January, 2010
|