బిగ్ బి నాకు స్ఫూర్తి: సచిన్
న్యూఢల్లీ : నేటి యువతరంలో చాలా మంది సచిన్ టెండుల్కర్ ను స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ ఆ సచిన్ లాంటి క్రికెట్ యోధుడు కూడా కొందరిని తనకు స్ఫూర్తి ప్రదాతలుగా భావిస్తున్నాడు. సచిన్ ఆదర్శనీయంగా భావిస్తున్న వారు మరెవరో కాదు బాలీవుడ్ లెజండరీ అమితాబచ్చన్, గాయకురాలు లతామంగేష్కర్, ఆశాభోంశ్లేలు. తమ తమ రంగాల్లో వారు సాధించిన విజయాలు తనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని సచిన్ స్యయంగా ప్రకటించాడు. తాను విభిన్న అంశాల ద్వరా స్ఫూర్తి పొందుతానని, టెన్నీస్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో విజేత ప్రసంగం వంటి పలు అంశాలు తనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటాయని మాస్టర్ బ్లాస్టర్ వివరించాడు.
కోల్ కతాకు చెందిన పాత్రికేయుడు గౌతమ్ భట్టాచార్య 'సచ్' పేరిట రాసిన పుస్తకంలో సచిన్ తన భావాలను పంచుకున్నాడు. ఇటీవల తాను ఆశాభోంశ్లే గాన సభకు వెళ్తే 75 వయస్సులో ఆమె చేసిన గానం తనను మైమరిపించడంతో పాటుగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని సచిన్ వ్యాఖ్యానించాడు. అలాగే అగ్నిపథ్ సినిమాలో 'మై విజయ్ దినానంత్ చౌహాన్' అంటూ అమితాబ్ డైలాగ్ చెప్పిన తీరు తనను విశేషంగా అకట్టుకుందని వివరించాడు.బాలీవుడ్ లో ఇన్నేళ్లు పాటు ప్రేక్షకులను రంజింపచేయడం ఒక అద్భుతంగా సచిన్ అభివర్ణించాడు. అమితాబ్, లతా, ఆశాభోంస్లేలది ముంబై కావడంతో వీలు కుదిరినప్పుడల్లా తాను వారిని కలుసుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. జీవన మాధుర్యాన్ని వారంతా అస్వాదిస్తున్నారని తాను దానినే ఇష్టపడతానని తెలిపాడు. అలాగే సంగీత దర్శకుడు రెహ్మాన్ ను పొగడ్తలతో ముంచెత్తే వాళ్లలో తాను ఒకడినని, ఆయన ఆస్కార్ అవార్డు సాధించిన సమయంలో తాను న్యూజిలాండ్ లో మ్యాచ్ ఆడుతున్నానని, ఆ నమయంలో తానెంతో గర్వపడినట్లు సచిన్ వివరించాడు. అక్కడ నుండే రెహ్మాన్ కు తాను అభినందనలు తెలిపినట్లు చెప్పాడు.
క్రికెట్ లో ఆశ్చర్యకరంగా అంతర్జాతీయ స్థాయిలో 30,000 పరుగులు సాధించి క్రికెట్ యోధులైన డాన్ బ్రాడ్ మాన్, వి వి రిచర్డ్స్ సరసన చేరడం, 20 ఏళ్లుగా క్రికెట్ లో సాధించిన విజయాలను తాను ఇప్పటికీ నమ్మలేక పొతున్నానని సచిన్ అభిప్రాయపడ్డాడు. అయితే తన క్రీడా జీవితంలో ఎన్నో విషాదకర ఘటనలు ఎదురయ్యాయని, తన తండ్రి మరణం, ఆత్మీయ మిత్రులు మస్కరేన్స్, రాజ్ సింగ్ దుంగార్పూర్ ల అకాల మృతి తనను తీవ్రంగా కలిచివేసాయని సచిన్ తన మనో విషాదాన్ని వెల్లడించాడు. ఇంగ్లాండ్ లో 1999లో వరల్డ్ కప్ ఇంగ్లాండులో సమయంలో తన తండ్రి మరణించారని, అయినా వరల్డ్ కప్ ఆడాలంటూ తనను కుటంబీకులు ప్రోత్సహించారని గుర్తు చేసాడు. అలాగే జనం భావిస్తున్నట్లు వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారాకు తనకు మధ్య ఎటువంటి విబేధాలు లేవని, తన ఆటను ఇప్పటికీ టీవీ లో చూస్తానని సచిన్ స్పష్టం చేసాడు. 1990లో కెనడాలో రెస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాచ్ లో భాగంగా ఇమ్రాన్ నేతృత్యం వహిస్తున్న పాక్ తో తలపడి 150-160 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసామని సచిన్ గుర్తు చేసుకున్నాడు. బ్యాటింగ్ అనుభవాన్ని తామిద్దరం ఆస్వాదించామని సచిన్ చెప్పాడు.
News Posted: 2 February, 2010
|