బీమా చేసుకున్న ఐపిఎల్ న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అధినేత లలిత్ మోడి, కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం ఇటీవల ఒక విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపిఎల్ మూడవ సీజన్ టోర్నీ జరిగినప్పుడు క్రీడాకారుల భద్రత సమస్యేమీ కాదని వారిద్దరూ ఘంటాపథంగా చెప్పారు. అయినప్పటికీ లీగ్ ప్రమత్తతకు అవకాశం ఇవ్వడం లేదు.
మార్చి 12న ప్రారంభం కానున్న 60 మ్యాచ్ ల మూడవ టోర్నీ కోసం ఐపిఎల్ 250 కోట్ల రూపాయల మేరకు 'టెర్రరిజం' బీమా పాలసీ తీసుకుంది. 'ఆస్ట్రేలియన్ క్రీడాకారులను ఇండియాకు రానివ్వండి. పాకిస్తానీ క్రీడాకారులను ఇండియాకు రానివ్వండి. వారు ముంబైలో ఆడవచ్చు. వారికి పూర్తి భద్రత ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తా' అని చిదంబరం ఇటీవల చెప్పారు. అయితే, టెర్రరిజం ఒక్కటే ముప్పు కాదు. ఆస్ట్రేలియన్లు పాల్గొనే పోటీలకు అంతరాయం కలిగిస్తామని శివసేన బెదరించింది. తెలంగాణ నిరసనోద్యమం కారణంగా హైదరాబాద్ లో పోటీలు అనుమానాస్పదంగా మారాయి. ఇప్పటికే ఐపిఎల్ ప్రారంభ కార్యక్రమాన్ని, తొలి పోటీని హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు.
కాగా, 'బీమా పాలసీల గురించిన వివరాలను మీడియాకు వెల్లడించబోము' అని ఐపిఎల్ సిఇఒ సుందరరామన్ స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో పరిస్థితుల కారణంగా హైదరాబాద్ లో డక్కన్ చార్జర్స్ (డిసి) ఆడే పోటీలకు ఇతర పోటీల కన్నా ఎక్కువ బీమా చేశారని సమాచారం అందింది.
టెర్రరిజం వంటి నిర్దుష్ట బెడద నుంచి బ్యాగేజి చోరీ వరకు ప్రతి విషయానికి ఐపిఎల్ బీమా పాలసీ తీసుకున్నది. 'ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, ఐపిఎల్, జట్ల యజమానుల మధ్య కుదిరిన ఒప్పందం పరిధిలోకి చివరకు వైద్య, వ్యక్తిగత ప్రమాద, బ్యాగేజీ బీమా కూడా వచ్చాయి' అని అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఈ సందర్భంలో కూడా ఇతర క్రీడాకారుల కన్నా వేలంలో కొనుగోలు చేసిన క్రీడాకారులపై అధిక ప్రీమియం చెల్లిస్తున్నారు. సామూహిక వ్యక్తిగత ప్రమాద పాలసీ ప్రకారం వేలంలో కొనుగోలు చేసిన ప్రతి క్రీడాకారునికీ రూ. 3 కోట్లు, రూ. 12 కోట్ల మధ్య బీమా సౌకర్యం ఉంది. క్రీడాకారుని మ్యాచ్ ఫీజును బట్టి ఇది మారుతుంటుంది. అతని మ్యాచ్ పీజుకు ఏడింతలు వరకు కూడా ఇది ఉండవచ్చు.
ఏదైనా వేలంపాటలో కొనుగోలు చేయని క్రీడాకారులపై వారి జట్ల యజమానులకు సాధారణంగా తక్కువ ఖర్చు అవుతుంది. వారికి రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వ్యక్తిగత ప్రమాద పాలిసీ, రూ. 5 లక్షల వైద్య బీమా సౌకర్యం లభిస్తాయి.పోటీలను నిర్వహించే సంఘానికి కూడా వెసులుబాటు ఉంటున్నది. తొక్కిసలాట, స్టాండ్ లలో అగ్నిప్రమాదం వంటి దుర్ఘటన ఏదైనా సంభవించినట్లయితే, 60 మ్యాచ్ లలో ఒక్కొక్కదానికి రూ. 10 కోట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది.
ఇది ఇలా ఉండగా, ఐపిఎల్ మూడవ టోర్నీలో తొలి బంతి ఇంకా వేయకుండానే ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ సంస్థ కార్యాలయంలో డబ్బుల గలగలలు వినిపిస్తున్నాయి. ఐపిఎల్ నుంచి భారీగా ప్రీమియంలు లభిస్తుండడంతో పాటు ఎనిమిది ఫ్రాంచైజీలూ టోర్నీ రద్దు, బాహ్య ప్రకటనలు, గేట్ రెవెన్యూ వసూళ్ళు వంటివాటి కోసం సమాంతర బీమా పాలిసీల గురించి ఓరియంటల్ సంస్థతో సంప్రదింపులు సాగిస్తున్నాయి.
ఇవి దాదాపు 59 పాలిసీలని, బీమా చేసిన మొత్తం మ్యాచ్ కు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఉంటుందని, స్టేడియం సీట్ల సామర్థ్యం, గేముపై అయిన ఖర్చులను బట్టి ఇది ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.
News Posted: 3 February, 2010
|