లక్ష్మణ్ స్థానంలో రోహిత్ నాగ్ పూర్ : సఫారీలతో పోరు సాగించడానికి సిద్ధమైన భారత జట్టులో లక్ష్మణ్ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేయనున్నాడు. గాయాలు పాలైన లక్ష్మణ్ పూర్తిగా కోలుకోకపోవడంతో ఆ స్థానంలో సెలెక్టర్లు రోహిత్ ను ఎంపిక చేసారు. జనవరి 20 న చిట్టిగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో లక్ష్మణ్ ఎడమ చేతికి తీవ్రమైన గాయమైంది. ఇక లక్ష్మణ్ ఈ టెస్ట్ సిరీస్ కు దూరమైనట్లే. అయితే ఇప్పటికే భారత జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ లు గాయాల బారిన పడ్డారు. జట్టులో టాప్ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటం ఇటీవల రంజీ ట్రోఫీలో త్రిపుల్ సెంజరీ సాధించిన రోహిత్ కాలం కలిసొచ్చింది.
తనను జట్టుకు ఎంపిక చేయడం పట్ల రోహిత్ హర్షం వ్యక్తం చేసాడు. అయితే కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్యంలోని సెలెక్టర్లు మరో అదనపు బ్యాట్స్ మెన్ గా వికెట్ కీపర్ వ్రిద్ధిమాన్ షాహా వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెప్టెన్ ధోనీకి కొద్దికాలంగా ఇబ్బందిపెడుతున్న వెన్నుముక నొప్పి తగ్గింది. ఈ సమస్య నుండి ధోనీకి కాస్త ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. ఈ సమస్య నుండి తాను పూర్తిగా కోలుకున్నట్లు ధోనీ ప్రకటించాడు. టెస్ట్ సిరీస్ కు సన్నద్దమవుతున్న ధోనీఈ టెస్ట్ సిరీస్ కు రాహుల్ ద్రావిడ్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసాడు. సర్జరీ చేసుకుంటున్నందున రాహుల్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ధోనీ తేల్చి చెప్పాడు.
అయితే టెస్ట్ మ్యాచ్లలో వరుసగా ఒకటి రెండు స్థానాల్లో ఉన్నభారత్, సౌత్ ఆఫ్రికా జట్లు మధ్య సిరీస్ జరుగుతుండటంపై ధోనీ ప్రతిస్పందించాడు. ఈ సిరీస్ లో మంచి ఆటతీరును కనబరిచేందుకే తాము ప్రాధాన్యతనిస్తామని, ర్యాంకుల అంకెల కోసం కాదని చెప్పాడు. అయితే భారత జట్టు పటిష్టమైన స్థితిలో ఉందని ధోనీ వ్యాఖ్యానించాడు. గాయాలతో ఉన్న భారత జట్టును దక్షిణాఫ్రికా సారథి గ్రేమీ స్మిత్ ఒత్తిడికి లోను చేసే అంశాన్ని కూడా ధోనీ తొసిపుచ్చాడు. ఒత్తడి తమకు కొత్త కాదని గత చాలా కాలంగా జట్టు ఒత్తిడికి గురవుతూనే ఉందని, అయితే తాము చాలా విజయాలు సాధించామని, తాజాగా బంగ్లాదేశ్ పై కూడా గెలిచామని ధోనీ చెప్పాడు. అయితే ఈ సిరీస్ కోసం ధోనీ భారీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. 50 గ్రాముల వరకు తన బ్యాట్ బరువును తగ్గించుకున్నట్లు తెలిసింది.
News Posted: 4 February, 2010
|