లారా ఇంట్లో చోరీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : ప్రఖ్యాత క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంట్లో అమూల్యమైన వస్తువులు మాయం అయిపోయాయి. అస్ట్రేలియా ప్రభుత్వం లారాను గౌరవిస్తూ అందచేసిన 'అర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా' పురస్కారంతో పాటుగా, 2 లక్షల డాలర్ల నగదు, ఆభరణాలు, బియాన్స్ షో కి చెందిన వివిఐపి టికెట్లు కూడా అపహరణకు గురైన వస్తువుల్లో ఉన్నాయి. దీంతో లారా తన నివాసానికి సమీపంలోని సెయింట్ క్లెయిర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
లారా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన నివాసం నుండి బయటికి వెళ్లి తిరిగి రాత్రి ఏడు గంటలకు చేరుకున్నాడు. రాత్రంతా పడుకుని బుధవారం ఉదయాన్నే నిద్ర లేవగానే తన ఇంట్లో వస్తువులు అపహరణకు గురైనట్లు లారా గమనించాడు. రెండు లక్షల డాలర్లు, విలువైన ఆభరణాలు, గ్రామీ అవార్డుల పాప్ సెన్సేషనల్ గాయని బేయాన్స్ చేసే 'ఐ యామ్' షోకు సంబంధించిన వివిఐపి టికెట్లు, చోగమ్ సమావేశం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రుడ్ తనకు ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవ పురస్కారం ఆపహరణకు గురైనట్లు లాగా గ్రహించాడు. దీంతో లారా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అయితే అనుమానం మేరకు లారా ఇంట్లో పనిమనిషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు. అంతేగాక లారా ఇంట్లో చోరీ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. సిఐడీ అధికారులు రంగంలోకి నిరంతరాయంగా కేసును విచారిస్తున్నారు. లారా ఇంట్లో చోరీకి గురైన సొత్తును తిరిగి రాబట్టేంత వరకు తాము విశ్రమించేది లేదని సీనియర్ సూపరింటెండెంట్ గ్లెన్ హకెట్ చెప్పారు. ఈ చోరీ వ్యవహారంపై మాట్లాడేందుకు లారా అందుబాటు లేరు. ఆయన సహచరుడు జోయే కర్యూ చోరీ జరగిందని ధృవీకరించారు. క్రికెట్ ప్రముఖుడి ఇంట్లో చోరీ జరగడం అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.
News Posted: 5 February, 2010
|