బిగ్ స్క్రీన్లపై ఐపీఎల్ లైవ్ న్యూఢిల్లీ : ఐపీఎల్ త్రీ మ్యాచ్ లు చూసేందుకు టికెట్లు దొరకటం లేదా..? మ్యాచ్ జరిగే నగరానికి వెళ్లడానికి వీలు కుదరడం లేదా..? అయినా మరేం బాధపడాల్సిన పని లేదు. ట్వంటీ20 వీరాభిమానులకు శుభవార్త వచ్చింది. టీవీల్లోనే కాదు... సినీ థియేటర్లలో కూడా మ్యాచ్ లు బిగ్ స్ర్కీన్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టీవీల్లో వలె ఈ థియేటర్లలో వాణిజ్య ప్రకటనలు లేకుండా వీక్షకులకు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలగనుంది. ఈ మేరకు యూఎఫ్ఓ మూవీజ్ సంస్థ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఐపీఎల్ సిరీస్ లో అన్ని మ్యాచ్ లను సినీ థియేటర్లకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఈ సంస్థ మల్టీప్లెక్స్ నెట్ వర్క్ లు అయిన సినీమ్యాక్స్, ఐనాక్స్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దేశంలోని వంద థియేటర్లలో ఐపీఎల్ త్రీ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న క్రౌన్ ఇన్ఫోటైన్ మెంట్ తో యూఎఫ్ఓ మూవీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. 550 థియేటర్లలో ప్రసారానికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయగా, వాటిలో 200 మల్టీప్లెక్స్ థియేటర్లే ఉన్నాయి. ఐపీఎల్ -3 ని క్రికెట్ అభిమానులు థియేటర్లలో కూర్చూని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని తాము కల్పిస్తున్నట్లు యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ కపిల్ అగర్వాల్ వెల్లిడించారు.
ఈ స్క్రీన్లలో మ్యాచ్ లను చూస్తే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుందని ఆయన వివరించారు. ఈ ప్రసారాల్లో టీవీల్లో వలె వాణిజ్య ప్రకటనలు ఉండవని, సాధారణం కంటే 33 శాతం స్క్రీన్ పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఐపీఎల్ సమయంలో సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ చేయనందున తమకు విశేష ఆదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.దీంతో థియేటర్ ఎగ్జిబిటర్లకు కూడా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆదాయం సమకూరనుందని ఆయన పేర్కొన్నారు.
News Posted: 5 February, 2010
|