ఐపీఎల్ తరలదు: రోశయ్య న్యూఢిల్లీ : హైదరాబాద్ కు కేటాయించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లు అక్కడే నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందున హైదరాబాద్ లో జరగాల్సిన ఐపీఎల్ ప్రారంభ ఉత్సవాలు ముంబాయికి తరలివెళ్తున్నాయన్న వార్తలను ఆయన ఖండించారు. ముందస్తుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ లన్నీ యథావిథిగా జరగనున్నాయని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్యూసీ) సమావేశంలో పాల్గోనేందుకు ఢిల్లీ వచ్చిన రోశయ్య మీడియాతో మాట్లాడారు. సీడబ్యూసీ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చిందని, యూపిఏ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి చిదంబరంలతో తాను ఈ విషయమై చర్చించానని ఆయన వెల్లడించారు.
అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనానికి నియమించిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై మాత్రం తాము చర్చించలేదని రోశయ్య స్పష్టం చేసారు. ఆలాగే రిటైర్డ్ జడ్డి జస్టిస్ బి ఎన్ కృష్ణను కమిటీకి చైర్మన్ గా నియమించడంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రోశయ్య స్పందిస్తూ రోజురోజుకు పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆర్థిక అంశాల పరంగా మాత్రం ఇక ప్రతిష్టంబన నెలకొందని సీఎం అభిప్రాయపడ్డారు. గత కొద్దిరోజులుగా జరిగిన ఆందోళనల కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు వేరే ప్రాంతాలకు తరలివెళ్లాయని, విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని సీఎం ఆవేదన వ్యక్తం చేసారు.
News Posted: 5 February, 2010
|