దక్షిణాఫ్రికా 291/2 నాగపూర్ : టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు నష్టపోయి 291 పరుగులు చేసింది. కేవలం 6 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా కష్టాల్లో పడినట్లైంది. అయితే, వన్ డౌన్, టూ డౌన్ స్థానాల్లో క్రీజ్ వద్దకు వచ్చిన హషిమ్ ఆమ్ల (115 నాటౌట్), జాక్విస్ కల్లిస్ (159 నాటౌట్) వీరోచిత సెంచరీలు చేసి భారత బౌలర్లకు దీటైన జవాబు చెప్పారు. తొలి వికెట్లు రెండింటినీ భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తీసుకున్నాడు. ఆట 4.3వ ఓవర్ వద్ద ఆష్వెల్ ప్రిన్స్ ను జహీర్ డకౌట్ చేశాడు. ప్రిన్స్ కొట్టిన బంతిని వికెట్ల వెనకే కాసుక్కూర్చున్న భారత కెప్టెన్ / కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ పట్టాడు. 6.3వ ఓవర్ మళ్ళీ జహీర్ విసిరిన బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గ్రేమ్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ సందర్భంగా టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లవిరిసింది. అయితే, ఆ ఆనందాన్ని కల్లిస్, ఆమ్లా ఎంతో సేపు నిలబడనివ్వలేదు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని వికెట్ల వద్ద పాతుకుపోయారు. ప్రారంభంలోనే రెండు టాప్ ఆర్డర్ వికెట్లను జారవిడుచుకున్నందున వీరిద్దరూ తొలుత ఆచి తూచి ఆడారు. అనంతరం నింపాదిగా ఆడుతూ సమయం చిక్కినప్పుడల్లా షాట్లు కొట్టి స్కోర్ వేగాన్ని పెంచారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 225 బంతులు ఆడిన ఆమ్ల 11 బౌండరీల సాయంతో 115 పరుగులు, 290 బంతులు ఎదుర్కొన్న కల్లిస్ 2 సిక్సర్లు, 14 బౌండరీల సాయంతో 159 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నైట్ వాచ్ మెన్ గా నిలిచారు.
News Posted: 6 February, 2010
|