భారత్ ఫాలో ఆన్ నాగపూర్ : టెస్ట్ మ్యాచ్ ల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీమిండియా కష్టాలు ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికాతో ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 233 పరుగులకే కుప్పకూలిపోయింది. దీనితో దక్షిణాఫ్రికా కంటే 325 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ ఆడుతోంది. ఫాలో ఆన్ కు భారత్ 125 పరుగుల దూరంలోనే చతికిలపడిపోయింది. భారత జట్టు పట్ల దక్షిణాఫ్రికా బౌలర్ సైంధవుడిలా దాపురించాడు. 16.4 ఓవర్లు బంతులు విసిరిన స్టేన్ కేవలం 51 పరుగులిచ్చి భారతజట్టులోని 7 వికెట్లను తుత్తునియలు చేశాడు. డేల్ ఓవర్లలో 6 మైడిన్ ఓవర్లు కూడా వేసి టీమిండియా బ్యాట్స్ మెన్ కాళ్ళకు బంధాలు వేశాడు. టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ (109 పరుగులు - 16 బౌండరీల సాయంతో), ఎస్. బద్రీనాథ్ అర్ధ సెంచరీ (56 పరుగులు - 7 బౌండరీలతో) తప్ప మరెవ్వరూ దక్షిణాఫ్రికా ముందు తలెత్తుకోగలిగిన స్కోర్ చేయలేక మైదానం నుంచి వెనక్కి పరుగులు తీశారు. మార్న్ మోర్కెల్, పాల్ హారిసన్, వేన్ పార్నెల్ తలో వికెట్ తీసుకున్నారు.
ఫాలో ఆన్ ఆడుతున్న భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే, ఆట 1.2వ ఓవర్ వద్ద భారత్ స్కోర్ కేవలం ఒకే ఒక్క పరుగు వద్ద మోర్కెల్ వేసిన బంతికి ఓపెనర్ గౌతం గంభీర్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు.
సోమవారం ఉదయం 25 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బరిలో దిగిన భారత్ వికెట్ల మధ్య తడబడిపోయింది. రెండో ఎండ్ లో తనకు తోడుగా క్రీజ్ వద్దకు వస్తున్న తన సహచర బ్యాట్స్ మెన్ ఇలా రావడం అలా వెళ్ళిపోతుండడంతో వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. కెప్టెన్ ధోనీ సహా టీమిండియా బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. వీరిద్దరి తరువాత ఓపెనర్ గంభీర్ 12 పరుగులు చేయగలిగాడు. మిగతా మరే బ్యాట్స్ మన్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. గంభీర్ 12, సెహ్వాగ్ 109, మురళీ విజయ్ 4, సచిన్ టెండుల్కర్ 7, ఎస్. బద్రీనాథ్ 56, ధోనీ 6, వృద్ధిమాన్ సాహ 0, హర్భజన్ సింగ్ 8, జహీర్ ఖాన్ 2, అమిత్ మిశ్రా 0. ఇషాంత్ శర్మ పరుగులేవీ చేయకుండా నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
News Posted: 8 February, 2010
|