కంగారూలపై 'బాల్' స్వింగ్ ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు పాల్గొనేందుకు అనుమతించబోమన్న హెచ్చరికను ఉపసంహరించుకోవలసిందిగా శివసేన అధినేత బాల్ థాకరేకి కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆదివారం స్వయంగా విజ్ఞప్తి చేసిన తరువాత ఈ విషయమై రెండు, మూడు రోజులలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు శివసేన సోమవారం తెలియజేసింది. 'ఆస్ట్రేలియన్ క్రీడాకారుల విషయమై థాకరే రెండు మూడు రోజులలో తుది నిర్ణయం తీసుకోగలరు' అని శివసేన పత్రిక 'సామ్నా' తెలియజేసింది.
శరద్ పవార్ ఆదివారం రాత్రి బాల్ థాకరేతో ముంబై శివారు ప్రాంతం బాంద్రాలోని ఆయన నివాసం 'మాతోశ్రీ'లో సమావేశం అయ్యారు. రెండు గంటల సేపు సాగిన ఈ సమావేశానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్, శివసేన ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కూడా హాజరయ్యారు. 'నాకు ఈ క్రీడ కన్నా దేశం మరింత ముఖ్యమైనది' అని థాకరే బిసిసిఐ మాజీ అధ్యక్షుడు పవార్ తో చెప్పినట్లు 'సామ్నా' తెలియజేసింది. 'భారతదేశాన్ని అవమానించడాన్ని నేను ఎన్నటికీ సహించను' అని సేన అధినేత స్పష్టం చేశారు.
'ఆస్ట్రేలియన్ జట్టు ఐపిఎల్ లో పాల్గొనదని, కాని ప్రతి ఐపిఎల్ జట్టులో ఒకరిద్దరు ఆస్ట్రేలియన్లు ఉంటారని బాలాసాహెబ్ తో మేము చెప్పాం' అని ఈ సమావేశం అనంతరం శశాంక్ మనోహర్ తెలిపారు. 'ఐపిఎల్ లో ఎంత మంది ఆస్ట్రేలియన్లు ఆడతారో తనకు సమాచారం అందజేయవలసిందని ఆయన అడిగారు. మేము ఒకటి రెండు రోజుల్లో ఆ సమాచారం అందజేస్తాం' అని మనోహర్ తెలిపారు. 'థాకరే, ఆయన (ఉద్ధవ్) మా మాటలను శ్రద్ధతో విన్నారు. ఐపిఎల్ పోటీలలో ఆడేది ఒకరిద్దరు ఆస్ట్రేలియన్ క్రీడాకారులు మాత్రమేనని, అన్ని ఐపిఎల్ పోటీలను జరగనివ్వకపోతే చివరకు నష్టపోయేది రాష్ట్ర క్రీడాకారులు (మరాఠీ క్రీడాకారులు) అని ఆయనకు నచ్చజెప్పేందుకు మేము ప్రయత్నించాం' అని మనోహర్ విలేఖరులకు తెలియజేశారు.
News Posted: 8 February, 2010
|