ఇండియా ఇన్నింగ్స్ ఓటమి నాగపూర్ : టెస్ట్ మ్యాచ్ లలో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకొనే విధంగా భారత్ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా ఫాలో ఆన్ లోనూ ఆ గండం నుంచి గట్టెక్కలేకపోయింది. కనీసం దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్ లో చేసిన పరుగులను కూడా రెండు ఇన్నింగ్స్ లలోనూ కలిపి చేయలేక చతికిలపడిపోయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 6 పరుగులతో ఓటమి భారాన్ని భుజానికెత్తుకొని తలదించుకుంది. తొలి ఇన్నింగ్స్ లో వీరేంద్ర సెహ్వాగ్, రెండో ఇన్నింగ్స్ లో సచిన్ టెండుల్కర్ మినహా మరెవ్వరూ సెంచరీ దరిదాపులకు కూడా స్కోరు చేయలేక బిక్కమొహాలు వేశారు. కాస్త గుడ్డిలో మెల్ల అన్నట్లుగా తొలి ఇన్నింగ్స్ లో ఎస్. బద్రీనాథ్ అర్ధ సెంచరి (56 పరుగులు) చేయగలిగాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ మిగిలిన ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ కూడా చేయలేక క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. కాగా, భారత బౌలర్ల తీరు కూడా అలాగే 'అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న' అన్న చందంగానే ఉంది. వికెట్లను తీయలేకపోయారు సరికదా దక్షిణాఫ్రికా జట్టు పరుగుల వరదనైనా భారత ఫీల్డర్లు నిలువరించలేకపోయారు. ఇలా అన్ని విభాగాల్లోనూ జావగారిపోయిన టీమిండియా ఇప్పుడు ఈ సీరీస్ లో 0 - 1 తేడాతో వెనుకబడి ఉంది. భారతదేశంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం తొలి టెస్ట్ మ్యాచ్ ఒక రోజు ముందుగానే ముగిసిపోయింది.
మరో వైపున దక్షిణాఫ్రికా వన్ డౌన్ బ్యాట్స్ మన్ హషిం ఆమ్ల 253 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో పక్కన దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు, మలి ఇన్నింగ్స్ లో మరో మూడు భారత వికెట్లను ఉప్పుపాతరేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో స్టెయిన్ మొత్తం 10 వికెట్లను తుత్తునియలు చేశాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ టెయిలెండర్ ఇషాంత్ శర్మ పరుగులేవీ చేయకుండా నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలవడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో ఇషాంత్ 5 బంతులు, రెండో ఇన్నింగ్స్ లో 11 బంతులు ఎదుర్కొన్నాడు. అయినా పరుగులు ఖాతా మాత్రం తెరవలేకపోయాడు. అమిత్ మిశ్రా రెండు ఇన్నింగ్స్ లోనూ డకౌట్లే అయ్యాడు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోర్ : గౌతం గంభీర్ 1, వీరేంద్ర సెహ్వాగ్ 16, మురళీ విజయ్ 32, సచిన్ టెండుల్కర్ 100, ఎస్. బద్రీనాథ్ 6, కెప్టెన్ ధోనీ 25, వృద్ధిమాన్ సాహ 36, హర్భజన్ సింగ్ 39, జహీర్ ఖాన్ 33, అమిత్ మిశ్రా 0.
తొలి ఇన్నింగ్స్ : గౌతం గంభీర్ 12, వీరేంద్ర సెహ్వాగ్ 109, మురళీ విజయ్ 4, సచిన్ టెండుల్కర్ 7, ఎస్. బద్రీనాథ్ 56, ధోనీ 6, వృద్ధిమాన్ సాహ 0, హర్భజన్ సింగ్ 8, జహీర్ ఖాన్ 2, అమిత్ మిశ్రా 0.
దక్షిణాఫ్రికా బౌలింగ్ : డేల్ స్టెయిన్ 3, పాలా హారిస్ 3, వేన్ పార్నెల్ 2, మోర్న్ మార్కెల్, జాక్విస్ కల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.
దక్షిణాఫ్రికా స్కోర్ : తొలి ఇన్నింగ్స్ లోనే ఆరు వికెట్లు నష్టపోయి 558 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీనితో దక్షిణాప్రికా ఇన్నింగ్స్ 6 పరుగులతో విజయం సాధించింది. 253 పరుగులు చేసిన హషిం ఆమ్ల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
News Posted: 9 February, 2010
|