'ఐపీఎల్ వేదిక మార్చొద్దు' హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను షెడ్యూల్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట రెడ్డి కేంద్రమంత్రి శరాద్ పవార్ ను కోరారు. ఐపీఎల్ ప్రారంభ ఉత్సవాలు, ఇతర మ్యాచ్ ల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకావని, యథావిథిగా వాటిని హైదరాబాద్ లోనే జరపాలని మంత్రి కొమటిరెడ్డి పవార్ కు మంగళవారం లేఖ రాసారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఐపీఎల్ ను రాష్ట్రంలో నిర్వహించకుండా వేరే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెలువడిన ప్రకటన క్రికెట్ అభిమానులను ఎంతగానో నిరాశ పరిచిందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మెరుగుపడినందున షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోనే నిర్వహించాలని పవార్ ను మంత్రి వెంకట రెడ్డి లేఖలో కోరారు. ఐపీఎల్ అడ్డుకుంటామని బెదిరించిన తెలంగాణ జేఏసీ కూడా మ్యాచ్ ల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చిందని లేఖలో మంత్రి పేర్కొన్నారు. ఆలాగే మ్యాచ్ ల నిర్వహణకు కావాల్సిన అన్ని భద్రత చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ కూడా సన్నద్ధంగా ఉందని పవార్ కు కొమటిరెడ్డి వివరించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ రాష్ట్రంలోనే జరుగుతుందని ముఖ్యమంత్రి రోశయ్య డిల్లీ పర్యటన ప్రకటన కూడా చేసారని మంత్రి పవార్ కు గుర్తు చేసారు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులున్నాయని, ఇక్కడ పిచ్ ప్రఖ్యాత క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రికీ పాంటింగ్ లు కూడా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసారని లేఖలో పేర్కొన్నారు. ప్రశాంతయుత వాతావరణంలో మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహిస్తామని తెలంగాణకు చెందిన ప్రతినిధిగా, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రిగా తాను హామీ ఇస్తున్నాని కొమటిరెడ్డి వివరించారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులను మంజూరు చేసినప్పిటికీ, ఇక్కడ ఐపీఎల్ ప్రారంభ వేడుకల వేదికపై సందిగ్థం నెలకొందని పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో మ్యాచ్ ల నిర్వహణకు వీలుగా తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి పవార్ ని కొమటిరెడ్డి కోరారు.
News Posted: 9 February, 2010
|