ఈడెన్ లో కల ఈడేరేనా? కోల్ కత : ప్రపంచ టెస్ట్ క్రికెట్ నంబర్ వన్ ఎవరో తేల్చడానికి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలిస్తోంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రధమ స్థానాన్ని టీమిండియా నుంచి కొల్లగొట్టడానికి తహతహలాడుతున్న దక్షిణాఫ్రికా, నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోడానికి పెనుగులాడుతున్న టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఫలితాన్నీ ఈడెన్ శాసించనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడెన్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న ఈడెన్ పిచ్ పరిస్థితిపై అందిరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పిచ్ ను స్పిన్నర్ లకు అనుగుణంగా మార్చుతున్నారన్న వార్తలు వెల్లువెత్తగా, వాటిని గ్రౌండ్ క్యూరేటర్ ప్రభిర్ ముఖర్జీ తొసిపుచ్చారు. వికెట్ల మధ్య క్రికెటర్లు తమ ఆటను అత్యున్నతంగా ప్రదర్శించేందుకు అనుగుణమైన పిచ్ ను మాత్రమే రూపొందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేసారు. పిచ్ ను స్పిన్ కో, ఫాస్ట్ బౌలింగ్ కో అనుగుణంగా మార్చే పద్ధతి లేదని, అయినా ఇంత తక్కువ వ్యవధిలో పిచ్ ను మార్చడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
స్పిన్ బౌలింగ్ కు అనుగుణంగా పిచ్ ను తీర్చిద్దాలని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) నుండి ఆదేశాలు వచ్చిన వార్తలను ప్రస్తావించగా, ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీసీఐ నుండి తనకు ఎటువంటి అధికారిక ఆదేశాలు తనకు అందలేదని ఆయన స్పష్టం చేసారు. అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి పిచ్ క్యూరేటర్లకు ఎటువంటి ఆదేశాలు వచ్చే అవకాశం లేదని ముఖర్జీ వివరించారు. కోట్లా ఉదంతం నుంచీ బిసిసిఐకి చెందిన గ్రౌండ్స్, పిచ్ ల కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదని వివరించారు.
అయితే భారత్-సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న కీలక సీరీస్ లో ఆతిధ్య భారత జట్టు 0-1 స్కోరుతో ఉంది. కీలకమైన ఈ మ్యాచ్ కు వేదికగా మారిన ఈడెన్ గార్డెన్స్ సహజంగా బ్యాట్స్ మ్యాన్ లకు అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో మొదటి మూడు రోజుల బ్యాటింగ్ చేసే అవకాశం దక్కిన వారే మ్యాచ్ ను శాసించే అవకాశం ఉంది. ఈడెన్ లో జరిగిన పలు అంతర్జాతీయ మ్యాచ్ లలో భారత్ అత్యుత్తమ ఆటను ప్రదర్శించి చాలా విజయాలను కైవశం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 315 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఈ స్టేడియంలో ఛేదించి మ్యాచ్ ను గెలిచింది. ఆలాగే ఈడెన్ లో జరిగిన గత ఐదు టెస్ట్ మ్యాచ్లలో బారత జట్టు మూడింటిని గెలవగా, రెండు మ్యాచ్ లను డ్రా చేసింది. మరి నెంబర్ వన్ గా నిలిపే మ్యాచ్ లో ఏం జురుగుతుందో వేచి చూడాల్సిందే.
News Posted: 10 February, 2010
|